calender_icon.png 16 January, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణాంక శాస్త్రంలో సీఆర్ రావు మేధోశిఖరం

11-09-2024 01:19:15 AM

  1. యువతరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
  2. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): గణాంక శాస్త్రంలో మేధో శిఖరమైన ఆచార్య సీఆర్ రావు తమ విజ్ఞానాన్ని సమాజ హితం కోసం ధారపోశారని భారత మాజీ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సీఆర్ రావు 104వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ‘పదిమందితో పంచుకో, పదిమంది బాగు కోరు’ అనేది భారతీయ సనాతన సంప్రదాయమని, ఈ సంప్రదాయాన్ని సీఆర్ రావు జీవిత పర్యంతం పాటించారని చెప్పారు. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జన్యు శాస్త్రం ఇలా ఏ శాస్త్రంలో అయినా గణాంక విశ్లేషణ ముఖ్యభూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. గణాంక విశ్లేషణ ద్వారా పాలన వ్యవహారాలు సులభం అవుతున్నాయని చెప్పారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గణాంక శాస్త్రంలో ఎన్నో ముఖ్యమైన నమూనాలను  సీఆర్ రావు ఆవిష్కరించారని చెప్పారు.

అలాంటి వ్యక్తి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. యువతరం సీఆర్ రావు స్ఫూర్తితో ముందు కుసాగాలన్నారు. విశ్వవిద్యాలయాలు  ఆవిష్కరణ కేంద్రాలుగా రూపొందాలని ఆకాం క్షించారు. క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్లు ఆవిష్కరణలు ఉండాలని, ఆ దిశగా యువతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్ర పంచంలో చాలా వేగవంతంగా మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఇందుకోసం ఉన్నత విద్యా కేంద్రాలు కేవలం సంప్రదాయ బోధనలకే పరిమితం కాకుండా ఆధునిక పరిశోధనా కేంద్రాలుగా అవతరించాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం ఉపకులపతి ఆచార్య బీజే రావు గారు, ఐఎస్‌బీ పూర్వ డీన్ ఆచార్య  ఎంఆర్ రావు, ఆచార్య డి.బాలసుబ్రమణ్యం, ఆచార్య యు.యుగంధర్, ఆచార్య శర్మ వెంకట్రామన్, మార్గదర్శి ఎండీ శ్రీమతి శైలజా కిరణ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.