- పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- సీపీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను పట్టి పీడిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులను పీడిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కాలేజీ మైదానంలో కందుల జీవన్‌కుమర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కొలిపాక వెంకటస్వామిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో బిలీనియర్ల సంఖ్య 2020లో 102 మంది ఉంటే .. ప్రస్తుతం 300కు పైగా చేరిందన్నారు. సంపద కొద్దిమంది వద్దనే కేంద్రీకృతమవుతోందని, సంపద సృష్టించే వారు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులేనన్నారు.
పాతపెన్షన్ విధానంలో ఉద్యోగికి గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్, డీఏ ఆధారిత సర్వీస్ పెన్షన్, కమ్యుటేషన్ సౌకర్యాలను కలిగి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ మాట్లాడుతూ.. సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల కడుపు నింపుతున్నాయని..
పెన్షన్ కన్నా ఉద్యోగి కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగమూర్తి, బుచ్చన్న, జిల్లా అధ్యక్షులు జీవన్‌కుమార్, రవీందర్‌రెడ్డి, అఫ్జల్, కొండా శ్రీనివాస్, లక్ష్మణమూర్తి, రవికాంత్, లక్ష్మీకాంత్, తోట విక్రమ్, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.