కూసుమంచిలో బడ్జెట్ ప్రతులు దగ్ధం..
కూసుమంచి (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ పేదరికాన్ని, పేదల్ని ముంచే బడ్జెట్ లా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలోని యడవల్లి పద్మా రెడ్డి భవనంలో జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్ గా, పేదలకు, మధ్యతరగతికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే విధంగా ఉందని వ్యవసారంగంపై రైతులపై, తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని, వికసిత భారత్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన కేంద్ర బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు మినహాయించి అన్ని వర్గాలను విస్మరించిందని స్పష్టం చేశారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచే గ్రామీణ ఉపాధి హామీ పనికి గత ఏడాది కేటాయించిన రూ.86 కోట్లను మాత్రమే మళ్ళీ ఈ బడ్జెట్లో చూపించారని విమర్శించారు. ఆహార భద్రతలకు గత సంవత్సరం బడ్జెట్లో రూ.2.75 లక్షల కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.2.4 లక్షల కోట్లకు కుదించటం దుర్మార్గమైన చర్యగా ఆయన విమర్శించారు. యూరియా సబ్సిడీని గత బడ్జెట్లో కంటే కుదించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టానికి గత బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఈ సంవత్సరం ఇంకా కుదిరించిందని, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ కేటాయింపుల్లో, సంక్షేమ విద్యార్థుల స్కాలర్షిపులు, రియింబర్స్ మెంట్, సామాజిక పింఛన్లు, అంగన్వాడి కేంద్రాలకు, నిధులు కేటాయింపులు వంటి వాటి ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ ప్రతులు దగ్ధం..
మండల కమిటీ సమావేశానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ మండల కేంద్రంలో సూర్యాపేట- ఖమ్మం రహదారిపై కేంద్ర బడ్జెట్ ప్రతులను(కాఫీలు) దగ్ధం చేశారు. యడవల్లి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్, డివిజన్ కమిటీ సభ్యులు మల్లెల సన్మంతరావు, బిక్కసాని గంగాధర్, శీలం గురుమూర్తి, మండల కమిటీ సభ్యులు, రాధాకృష్ణ, కర్ణ బాబు, గన్యనాయక్, వీరారెడ్డి, వెంగళరావు, నరసింహ, వెంకటయ్య, ఎస్క బాబు, జవ్వాజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.