రైతులను నిలువు దోపిడి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం
సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు- జాజిరి శ్రీనివాస్
సత్తుపల్లి,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలులో రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని సిపిఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సత్తుపల్లి లోని రావి వీర వెంకయ్య భవనం లో జరిగిన సిపిఎం సత్తుపల్లి మండల కమిటీ సమావేశం అయినంపూడి సనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. మండల వ్యాప్తంగా రైతుల వరి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు.
వరి కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం ఎగుమతి చేయక రెండు నెలలుగా మార్కెట్ యార్డులలోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. మిల్లర్ల యాజమాన్యం ఒక్క లారీ దిగుమతి కోసం ఆరు రోజుల సమయం తీసుకోవడంతో లారీల కొరత ఏర్పడి వడ్ల కొనుగోలు ఆలస్యం జరుగుతుందని అన్నారు. రైతాంగం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులు రాజకీయ నాయకులగా ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. వడ్ల కొనుగోలు జరగకపోవడంతో రైతులు వాతావరణ మార్పులతో బెంబేలెత్తుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల యాజమాన్యం వడ్ల కొనుగోలు విషయంలో తీరు మార్చుకోవాలని లారీల కొరత, తరుగు లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగం స్పందించి వడ్ల కొనుగోలు వేగవంతం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.






