02-04-2025 04:29:47 PM
ఇల్లెందు (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను యూనివర్సిటీ విద్యార్థులు, సిపిఎం నాయకులు వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తూ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని దీనిని నిరసిస్తూ సిపిఎం ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు జగదాంబ సెంటర్ లో ప్లేకార్డులతో నిరసన తెలియజేయటం జరిగింది.
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి మాట్లాడుతూ... రాష్ట్ర ఆదాయం కోసం ప్రభుత్వం భూములను అమ్ముకోవడం సిగ్గుమాలిన చర్య అని, విద్యార్థులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న గాని ప్రభుత్వం పునరాలోచించకుండా విద్యార్థులపైన, నాయకులపైన పోలీసుల జులుం చూపించడం సరికాదని అన్నారు. దేశ భవిష్యత్తు భవితరాలపై లాఠీ ఛార్జి చేసిన ఏ ప్రభుత్వం మిగలలేదని ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులకు క్షేమపన చెప్పి భూముల నుండి వెనక్కి వెళ్లాలని లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పతనం తానే కోరి తెచ్చికుంటుందని అన్నారు.
ఉద్యమాలు అణచి వేయాలని చూస్తే ఆకాశం మీద చూస్తూ ఉమ్మి వేసినట్లే అని అన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులందరు ఖండించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేసి యూనివర్సిటీ భూముల నుండి వెనక్కి వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ ఆందోళనలు, పోరాటాలు ఆగవని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, సర్వన్, వజ్జ సురేష్, నాగరాజు, తాండ్ర కాంతమ్మ, ఆర్ బి జె రాజు, శ్రీను, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.