09-04-2025 05:20:58 PM
పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయొద్దని ఆందోళన..
ఇల్లెందు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజీల్ ధరలు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయని ధరల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించలని సిపిఎం ఇల్లందు మండల కార్యదర్శివర్గ సభ్యులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావులు అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారిలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలెండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్రములో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ సిలెండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణం అని దీనివల్ల ఉజ్వల పథకం లబ్దిదారులు, సాధారణ వినియోగదారులతో పాటు, మహాలక్ష్మి స్కీం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను ఉపసంహరించు కోవాలని, దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, అన్ని రకాల సరుకులు, వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57 శాతం పెంచడంతో పాటు, సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని అన్నారు.
కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్లురాయితీలిస్తూ, రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 100 కోట్ల భారం మోపుతున్నదని,పెంచిన వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ పాలకులపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు వజ్జ సురేష్, వీరభద్రం, వెంకన్న, సంతోష, కోటమ్మ, నీలారాణి, పాషా, నర్సయ్య, కౌసల్య, మంగ, భవాని తదితరులు పాల్గొన్నారు.