calender_icon.png 28 October, 2024 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఉద్యమాల చుక్కాని సీపీఎం పార్టీ

27-10-2024 09:09:12 PM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు

గజ్వేల్,(విజయక్రాంతి): సీపీఎం పార్టీ ఎర్రజెండాతో దేశవ్యాప్తంగా భూ ఉద్యమాలు, రైతాంగ, కార్మిక పోరాటాలు నిర్వహించిందని, సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలకు చుక్కానిలా సీపీఎం పార్టీ నిలిచిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్1,2 తేదీల్లో నిర్వహించనుండగా, ఈ మేరకు ఆదివారం గజ్వేల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేరళలో ప్రవాయిలార్, బెంగాల్లో తెబాగ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టిన ఘనత సీపీఎం పార్టీదేనన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందని, వెట్టిచాకిరి విముక్తికి సీపీఎం పార్టీ కృషి చేసిందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సీపీఎం పార్టీ బలంగా ఉందని, అనేక దేశాల్లో పార్టీ బలంగా విస్తరిస్తుందన్నారు. సీపీఎం పోరాటాల వల్ల ప్రజావ్యతిరేక చట్టాలను ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నట్టు గుర్తు చేశారన్నారు. ప్రభుత్వ రంగ రక్షణకు, ప్రైవేటు, కార్పోరేటు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. సీపీఎం పార్టీ మూడో జిల్లా మహాసభలకు రైతాంగం కార్మికులు, ప్రజలు భారీసంఖ్యలో హాజరై పోరాటాలను బలపర్చాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య, గోపాలస్వామి, శశిదర్, భాస్కర్, సత్తిరెడ్డి, నాయకులు శారద, రవి, యాదగిరి, శిరీష, రంగారెడ్డి, బండ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.