19-04-2025 03:34:03 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 255/1 సర్వే నంబరు ప్రభుత్వ భూమిలో మూడు సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని ఆ నివసిస్తున్న నిలువ నీడలేని పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి కి సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ భూమి అనేక ఎకరాలను గత ప్రభుత్వ హయాంలో నేతలు కొందరు కబ్జా చేసి వెంచర్లు చేసి కోట్లు దండుకున్నారని, నిలువ నీడలేని పేదల చేత తమ పార్టీ ఆధ్వర్యంలో కొంత స్థలంలో గుడిసెలు వేయిస్తే అనేకసార్లు దాడులు చేసి గుడిసెలు తొలగించి అక్రమంగా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారని ఆరోపించారు.
తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని భావిస్తే ఈ ప్రభుత్వం కూడా నిరుపేదల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుందనడానికి ఇటీవల గుడిసెల తొలగింపుకు అధికారులను పోలీసులను ఉసిగొల్పడమే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని వారికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించారా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి పట్టణ కార్యదర్శి భానోతు సీతారాం నాయక్ పాల్గొన్నారు.