మందమర్రి (విజయక్రాంతి): పోరాటాల ప్రతిబింబంగా సిపిఐ(ఎం) జిల్లా 3వ మహాసభలు ఈనెల 8, 9 తేదీల్లో పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో నిర్వహించనున్న మహాసభలలో భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని వివరించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, పాలడుగు భాస్కర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పైళ్ళ ఆశయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లాలోని 18 మండలాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు బ్లాక్ లను వేలం పాటలు పెట్టి సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం జరుగుతుందని, వేలం పాటలు రద్దు చేసి బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలోని తోళ్ల పరిశ్రమను ప్రారంభించి మూసి వేశారని, వెంటనే తొళ్ళ పరిశ్రమను ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకువచ్చే వేదికగా జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. జిల్లా అభివృద్ధి కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో బలమైన పోరాటాలు నిర్వహించడానికి మహాసభల్లో ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, గుల్లా బాలాజీలు పాల్గొన్నారు.