భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ (63) ఖమ్మంలో గుండెపోటుతో బుధవారం మృతిచెందారు. మృతదేహాన్ని పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్ధం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం 'గిరిప్రసాద్ భవన్'లో ఉంచారు. మృతదేహాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సందర్శించి నివాళులర్పించారు, ప్రసాద్ మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, ఎస్ డి సలీం, సారెడ్డి పుల్లారెడ్డి, రావులపల్లి రవికుమార్, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నాయకులు వట్టికొండ మల్లికార్జునరావు, వాసిరెడ్డి మురళి, జి రామకృష్ణ, మైనార్టీ సంఘం నాయకులు, కొత్తగూడెం ఉర్దూఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి తదితరులు మృతదేహాన్ని సందర్శించిఘన నివాళులర్పించారు. విద్యార్థి, యువజన సంఘం నాయకుడిగా, ఏఐటీయూసీ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్టీకి, ప్రజా సంఘాలకు యెనలేని సేవలందించిన మచ్చలేని నాయకుడు పోటు ప్రసాద్ అని, అయన ఆకస్మిక మృతి తీవ్ర ద్రిగ్భాంతికి గురిచేంసిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 29న ఖమ్మంలో జరిగే అంత్యక్రియలకు పార్టీ, ప్రజాసంఘాల శ్రేణులు తరలిరావాలని కోరారు.