ఆదిలాబాద్ (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన సీపీఐ పార్టీ రానున్న రోజుల్లో సైతం పేద ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేయనుందని ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఆదిలాబాద్ రూరల్ మండలం నిశాన్ ఘాట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రభాకర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ముందుండి పోరాడుతుందని పేర్కొన్నారు. నిషన్ ఘాట్ లోని పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పేదలు ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్న కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, అమీనా, నిసార్, కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.