calender_icon.png 28 December, 2024 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నాయకుల డిమాండ్

06-12-2024 05:59:39 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పాలకులు, అధికారులు పరిష్కరించాలని సీపీఐ మండల, పట్టణ కార్యదర్శులు మేదరి దేవవరం, రాచర్ల రవి కిరణ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాయకులు మాట్లాడారు. మండలంతో పాటు మున్సిపాలిటీలో పలు సమస్యలు తాండవిస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పలు గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు వెడల్పు, డ్రైనేజ్, తాగునీరు సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పన్నుల వసూళ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదన్నారు. పట్టణంలో మినీ స్టేడియం పేరుతో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. చిరు వ్యాపారులకు అన్యాయం చేశారన్నారు. పలు గ్రామాలతో పాటు మున్సిపాలిటీలో కుక్కలు, కోతుల బెడదను నివారించకపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వెల్లడించారు. సీసీ కెమెరాలు పని చేయడం లేదని, అధికారులు సీసీ కెమెరాల పనితీరు గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. అదే విధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలతో ప్రజా సమస్యలను గాలి వదిలేశారని, నాయకులకు పదవులపై ఉన్నటువంటి ప్రేమ ప్రజాసేవపై లేదన్నారు. అదే విధంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ మండల యూత్ సెక్రటరీ లింగంపెల్లి భాను చందర్, ఏఐటీయూసీ మండల ఉపాధ్యక్షుడు దుర్గం దేవయ్య తదితరులు పాల్గొన్నారు.