100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సిపిఐ పార్టీ.
శాంతినగర్ లో ఘనంగా పార్టీ జెండా ఆవిష్కరణ, వేడుకలు.
అనంతగిరి: సీపీఐ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా మండల కేంద్రంలో, శాంతినగర్ గ్రామంలో ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతగిరి మండల కేంద్రంలో మండల యువజన సంఘం అధ్యక్షులు డేగ వీరన్న, శాంతినగర్ గ్రామంలో మండల కార్యవర్గ సభ్యులు నాగభద్రం పార్టీ జెండాలను ఎగరవేసారు. ఈ సందర్భంగా అనంతగిరి మండల యువజన సంఘం అధ్యక్షులు డేగ వీరన్న మాట్లాడుతూ... బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకై క పార్టీ సీపీఐ అన్నారు.
దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టు యోధులు అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారని చెప్పారు. భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. నేటికీ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు యర్రసాని రవి నాయకులు బత్తిని వీరబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.