calender_icon.png 30 October, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులందరికీ రుణమాఫీ చేయాలి

11-08-2024 03:50:36 PM

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి     

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

మంచిర్యాల విజయక్రాంతి: రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం సిపిఐ మంచిర్యాల జిల్లా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం లో 61 మంది కౌన్సిల్ సభ్యులను 15 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ పై ప్రజలందరూ విశ్వాసం తో గెలిపించారని ఆ విశ్వసాన్ని నిలబెట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల హామీల్లో భాగంగా క్రాఫ్ లోన్ తీసుకున్న ప్రతి రైతుల రుణాలు మాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ ఫుడ్ సెక్యూరిటీ (రేషన్) కార్డులు ఇవ్వాలని, అర్హులకు ఆసర పెన్షన్లు ఇవ్వాలని, సదరం సర్టిఫికెట్ అందజేయడంలో షరతులు తొలగించాలని, వికలాంగులకు రూ . 600,  వితంతులకు,  వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇవ్వాలని, స్కీం వర్కర్లందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

ప్రభుత్వంలో వివిధ శాఖల్లో సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి కంపెనీకి రావలసిన 29 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని, సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, 2023 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలు ప్రకటించి 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటనకే పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయం గుర్తించి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, రైతుబంధును వెంటనే షరతులు లేకుండా ప్రతి రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలీందర్ అలీఖాన్ , రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, లింగం రవి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, చాడా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.