హైదరాబాద్,(విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు సోమవారం విడుదల చేశారు. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యమని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నామని సుధీర్ బాబు చెప్పారు. ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థలు ఏర్పాటు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. పోలీసుల విధి నిర్వహణలో వి.క్యూ.టీ పద్ధతిని పాటిస్తున్నామని తెలిపారు.
వి అంటే విజిబుల్ పోలీసింగ్, క్యూ అంటే క్విక్ రెస్పాన్స్, టి అంటే టెక్నాలజీ అని అర్థమన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో 30 వేల కేసులు నమోదైనట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. నమోదైన కేసుల్లో 73 శాతం పరిష్కారించమని, 106 మందికి శిక్షలు, అందులో 30 మందికి జీవిత ఖైదు, మూడనమ్మకాలపై నమోదైన ఒకే కేసులో 14 మందికి జీవిత ఖైదు పడిందని ఆయన స్పష్టం చేశారు. డయల్ 100 ద్వారా ప్రతి 2 నిమిషాలకు ఒక ఫిర్యాదు అందుతుందని, అలా 2.40 లక్షల ఫిర్యాదులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.