బ్యాంకుల వద్ద రాత్రిళ్లు గస్తీ
మేనేజర్లకు తుపాకీ లైసెన్స్
సమీక్షా సమావేశంలో ఖమ్మం సీపీ సునీల్‌దత్
ఖమ్మం (విజయక్రాంతి): బ్యాంకుల్లో భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఖమ్మంలో పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్ణాటకలోని శివాజీ చౌక్‌లో ఏటిఎం నగదు వ్యాన్‌పై బీదర్ గ్యాంగ్ దాడి చేసి నగదును లూటీ చేసిన నేపథ్యంలో ఖమ్మం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ఏటీఎంలలో నగదు నింపే వాహనాల రక్షణ చర్యలపై ఈ సందర్బంగా సీపీ సమీక్షించారు. అన్ని బ్యాంకుల వద్ద రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల్లో భారీ లావాదేవీలు జరిగిన సందర్బంలో మేనేజర్ కోరిక మేరకు ప్రత్యేకించి, పోలీస్ భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆయా బ్యాంక్ మేనేజర్లు తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్ సమీప ఇళ్లల్లో ఎవరు నివశిస్తన్నారో సెక్యూరిటీ పర్సస్ చెక్ చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.