27-02-2025 07:35:58 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ శ్రీనివాస్ లు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాల గురించి వాకబు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. అంతకుముందు రామగుండం సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీ ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలులో ఉన్నట్టు తెలిపారు. కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏసీపీలు, సీఐ లు, ఎస్సై లు సిబ్బంది మొత్తం 560 మందితో పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రత చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ పోలింగ్ కేంద్రాలలో పలుమార్లు తనిఖీ చేసి ఓటర్ల కు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వయోభారంతో బాధడుతున్న వారిని, దివ్యాంగులు కూడా ఓటు వేసే విధంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ సహకరించారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగడంలో ఎస్సై పీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహించారు.