calender_icon.png 1 October, 2024 | 5:11 AM

రాజ్యమాతగా గోవు

01-10-2024 02:54:38 AM

దేశీయ ఆవులకు మహారాష్ట్ర గౌరవం

రాష్ట్రమాత-గోమాతగా ప్రకటన

ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్

గోశాల నిర్వాహకులకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం

ముంబైకి విచ్చేసిన శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ

ఘనస్వాగతం పలికిన మహారాష్ట్ర మంత్రి 

ముంబై, సెప్టెంబర్ 30: దేశీయ ఆవులను రాజ్యమాత-గోమాతగా ప్రక టిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రాచీనకాలం నుంచి ఆవులను పూజిస్తూ వస్తున్నారు. ఆవుల ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర క్యాబినెట్ గోవులను రాష్ట్రమాతగా ప్రకటిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంస్కృతి, వ్యవసాయపరంగా ఆవుల ప్రాముఖ్యాన్ని గుర్తించి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వేద కాలం నుంచి భారత సంస్కృతిలో దేశీయ ఆవుకు శాస్త్రీయంగా, ఆర్థికంగా, మతపరంగా ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు.

అందుకే ఆవును కామధేనువుగా కొలుస్తారు. మానవ ఆహారంలో ఆవు పాలు ఉపయోగకరం. ఆయుర్వేద వైద్యం, పంచగవ్య చికిత్సా విధానం, సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ, గోమూత్రానికి ముఖ్యమైన స్థానముంది. అందువల్ల ఇకపై దేశీయ ఆవులను రాజ్యమాత గోమాతగా ప్రకటిస్తున్నాం అని ప్రభుత్వం పేర్కొంది. 

గోశాల నిర్వాహకులకు రాయితీ

ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. దేశీయ ఆవులు రైతులకు ఒక వరం. అందుకే వాటికి రాజ్యమాత హోదా ఇవ్వాలని నిర్ణయించాం. గోశాలల్లో దేశీయ ఆవుల పెంపకానికీ సాయం చేయాలనుకుంటున్నాం. అందుకే పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనల మేరకు గోశాల నిర్వాహకులకు రోజుకు రూ.50 రాయితీ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం.

మహారాష్ట్ర గోశాల కమిషనరేట్ ఈ గోశాలల నిర్వహణను పర్యవేక్షిస్తుంది అని తెలిపారు. కాగా, మహా రాష్ట్రలో 2019 లెక్కల ప్రకారం 46.13 లక్షల దేశీయ ఆవులు ఉన్నాయి. గతంతో పోలిస్తే 20.69 శాతం వీటి సంఖ్య తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నిర్ణయంతో గో హత్యల నివారణతో పాటు ఆవుల స్మగ్లింగ్‌ను అరికడుతుందని ప్రభుత్వం భావిస్తోందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. దేశంలో హిందువుల సంఖ్య ఎక్కువనీ, చాలా మంది గోవును మాతగా భావిస్తారని చెప్పారు. గోమాతకు గౌరవంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 

హిందుత్వను వదిలిపెట్టం

మహారాష్ట్రలో హిందువుల ఐకమత్యం, నమ్మకంపై సీఎం ఏకనాథ్ షిండే ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర ప్రజలు వీటికి ఎం తో ప్రాముఖ్యాన్ని ఇస్తారని తెలిపారు. థాణే లో జరిగిన సనాతన్ రాష్ట్ర సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న షిండే.. సంత్ ధ్యానేశ్వర్ ప్రవచనాలను గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి ప్రసంగ సమయంలో ప్రజలు జైశ్రీరాం అంటూ నినాదాలు చేయగా.. ప్రస్తుతం తాను ఆయోధ్యలో ఉన్నట్లు భావిస్తున్నానని చెప్పా రు. మహారాష్ట్ర సాధువులు, ధైర్యవంతులకు జన్మభూమి. ధర్మం, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మానవత్వంతో మెలిగే సంస్కృతి మనది.

విపక్షాలు అధికారంలో ఉండగా 2020లో పాల్‌ఘాట్ జిల్లాలో ఇద్దరు సాధువులపై జరిగిన దాడిని ఉపేక్షించేది లేదు. ఇలాంటి అంశాలపై మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. మా తుదిశ్వాస వరకూ హిందుత్వను వదిలిపెట్టము అని పేర్కొన్నారు.     

ముంబైలో శంకరాచార్య స్వామీజీ

రాష్ట్ర మాతగా గోమాతను మహారాష్ట్ర ప్రకటించిన వేళ దేశవ్యాప్తంగా గో సంరక్షణకు పాటుపడుతోన్న జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వారానంద్ సరస్వతి స్వామీజీ ముంబైకి విచ్చేశారు. స్వామీజీకి మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ రవీంద్ర సావంత్ ఘన స్వాగతం పలికారు.

పూలమాల వేసి స్వామీజీ ఆశీర్వాదం పొందారు. శంకరాచార్య స్వామీజీ సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా ఆవుల సంరక్షణ కోసం గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వామీజీ ముంబైకి వచ్చినట్లు సమాచారం. 

తెలంగాణ మాటేమిటి?

గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కొన్నేళ్లుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణలోనూ అనేక సంఘాలు ఇందుకోసం కృషి చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్‌కు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి గోమాతను దర్శించుకున్నాకే ఓటు వేశారు.

అయినా గోవును రాష్ట్రమాతగా ప్రకటించే అంశంపై తెలంగాణ ప్రభుత్వంలో ఎవరూ స్పందించకపోవడం ఏమిటని గో రక్షకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో శంకరాచార్య స్వామీజీ గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర అక్టోబర్ 9న జరగనుంది. ప్రస్తుతం మహారాష్ట్ర తప్ప వేరే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ నిర్ణయం తీసుకోలేదు. శంకరాచార్య యాత్ర ద్వారా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.