calender_icon.png 11 January, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులిదాడిలో కోడె దూడ మృతి

02-11-2024 02:25:08 AM

భైంసా, నవంబర్ 1(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి శుక్రవారం ముథోల్ నియోజకవర్గం కుంటాల మండలం సూర్యాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకుందని అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ ప్రాంతంలో ఓ కోడె దూడపై దాడి చేసి చంపడం పులి సంచారానికి ప్రతీక అని తెలిపారు. డీఆర్వో శంకర్, ఎఫ్‌ఎస్వో కీర్తిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపూర్‌కు చెందిన వ్యవసాయ కూలీ హన్మంతు శుక్రవారం పశువులు మేపేందుకు అటవీప్రాంతానికి వెళ్లాడు.

మందలోని ఓ కోడెదూడను పెద్దపుల్లి లాక్కెల్లింది. దీంతో భయభ్రాంతులకు గురైన హన్మంతు సమీపంలోని చెట్టు ఎక్కాడు. గమనించిన పులి చెట్టు వద్దకు వచ్చింది. కాసేపటి తర్వాత పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సాయంతో హన్మంతు చెట్టుకిందకు దిగి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. డీఆర్వో శంకర్, ఎఫ్‌ఎస్వో కీర్తిరెడ్డి, ఎఫ్‌బీవో హరిలత వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. పశువైద్యాధికారి ప్రియాంక ఆధ్వర్యంలో పాదముద్రలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీప్రాంతానికి వెళ్లొద్దని, అవసరమైతే గుంపులు గుంపులుగా, అరుపులు, కేకలు వేస్తూ వెళ్లాలని సూచించారు.