calender_icon.png 11 March, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోవర్టులకు నామినేటెడ్ పదవులు ఉండవు

11-03-2025 12:15:17 AM

  • సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో 
  • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 

సిద్దిపేట, మార్చి 10 (విజయక్రాంతి): సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ కోవర్టులు ఉన్నారని అలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వమని, పార్టీలో ఉన్న కోవర్టులను దశలవారీగా ఏరివేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

40 ఏళ్లుగా పార్టీలో ఉన్నాం మాకు నామినేటెడ్ పదవులు కావాలి అంటే కుదరదాని, పార్టీ కోసం పని చేసిన వారై ఉండాలని సూచించారు. పది సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈనెల చివరి వరకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాబోయే స్థాని క సంస్థల ఎన్నికల్లో గెలిచే నాయకులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి దక్కాల్సిన నైతికతను పార్టీ అధిష్టానం పాటిస్తుందని దానికి అసెంబ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనని ఉదాహరణగా వివరించారు. సిద్దిపేట కాంగ్రెస్ లో బీఆర్‌ఎస్ కోవర్టులు ఉన్నారని అలాంటి వారిపై త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పసుపు, బియ్యం పెట్టి ఒట్టు పెట్టిస్తానని వెల్లడించారు.

ముస్లింలు అయి తే అల్లాహ్ సాక్షిగా, క్రైస్తవులు అయితే యేసు క్రీస్తు సాక్షిగా ప్రమాణం చేయాలని అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఇంకా వాళ్లు అధికారంలో ఉన్నట్లు ఊహించుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.

పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్‌ఎస్ పార్టీకి సుమారు రూ.20 వేల కోట్ల పార్టీ ఫండ్ పోగు చేసుకున్నారని అదే కాంగ్రెస్ పార్టీకి అంత మొత్తంలో పార్టీ ఫండ్ లేదని చెప్పారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల ద్వారా బీఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ వెలుగు చూసిందని ఇంకా ఆ పార్టీ వైఖరింటో తెలిసిపోయిందని చెప్పారు. 

పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు... 

బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు వారికి నచ్చిన పోస్టులో కొనసాగి ఎంజాయ్ చేశారని అలాంటి వారిని ఆ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు బదిలీ చేయాలని మైనంపల్లి హనుమంతరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో లూప్ లైన్ పదవుల్లో కొనసాగిన పోలీస్ అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తూ కోరినచోట పోస్టింగ్ ఇవ్వాలని మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సిద్దిపేటలో ఏసీపీగా పని చేసిన సురేందర్ రెడ్డి ని ఆదిలాబాద్ కు బదిలీ చేసి మళ్లీ ఏ నాయకుల ప్రమేయంతోనో తెలియదు కానీ సంగారెడ్డి కి బదిలీ చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేందర్ రెడ్డి ఒక ఉదాహరణ మాత్రమేనని ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని, ప్రభుత్వం ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి తగిన విధంగా చర్యలు చేపట్టాలని పోలీసులపై ఆసక్తికరమైన వాక్యాలు చేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, పార్టీ రాష్ట్ర నాయకులు దేవులపల్లి యాదగిరి, గూడూ రు శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్, యువజన శాఖ అధ్యక్షులు గయాస్, నాయకులు గంప మహేందర్, సాకీ ఆనంద్, దాస అంజయ్య, గరిపల్లి రాములు, పుల్లూరు కనకయ్య, ఆలకుంట మహేందర్, మార్గ సతీష్, తదితరులు పాల్గొన్నారు.