* మహాకవి దాశరథి కృష్ణమాచార్య పేరు చెబితే చాలామందికి ‘అగ్నిధార’ వంటి ఆయన కవితాక్షరాలే స్ఫురణకు వస్తాయి. కానీ, ఆయన కొన్ని కథలూ రాశారు. వాటిలో కవిత్వం కథా వస్తువుకు తగ్గట్టు ‘తెల్లవారి వెలుగువలె’ చైతన్యకాంతులను చిమ్ముతూ దర్శనమిస్తుంది. కవిత్వానికైనా, కథలకైనా ఆయన ఎన్నుకొన్న వస్తువులు, ఇతివృత్తాలు పూర్తిగా తాను, తెలంగాణ సమాజం ఎదుర్కొన్న అప్పటి నిజజీవిత సంఘటనల్లోని అనుభవాలే అన్నది సుస్పష్టం. ఇవాళ వారి ‘శత జయంతి’ సంవత్సర వేడుక సందర్భంగా ‘విజయక్రాంతి’ పాఠకుల కోసం అత్యంత అరుదైన ఈ కథను సగర్వంగా పునర్ముద్రిస్తున్నాం.
- ఎడిటర్
* నాడు మోదుగులు ఎర్రగా మండినై. అడవి అంతా వసంతంతో నిండిపోయింది. ఎన్ని ఎండలు కొట్టినా ఆ వసంతశోభ ఆవంతైనా తగ్గలేదు. ఎంత బావుంటై పూచిన మోదుగులు! మోదుగు పూచిందంటే పండగ.
ప్రతి సంవత్సరం మోదుగు పూతకోసం యెదురు చూసేవాడు సారంగపాణి. వాడికి పసితనం నుంచీ అదే పిచ్చి. మోదుగు పూలకోసం తహతహలాడే పిచ్చి వాడికి ఎన్నడూ తగ్గలేదు.
రెండేళ్ళ క్రితం మోదుగు పూలు చల్లారిపోయి వానలు పడగానే జైలుకు పోయాడు సారంగ పాణి. కొన్నాళ్ళు వానలూ, చలీ గడిచాక మళ్ళీ మోదుగులు పూచినాయి. మోదు గులు పూస్తున్నాయని వాటిని చూడాలని చాలా బాధపడ్డాడు సారంగ పాణి.
వరంగల్లు సెంట్రల్ జైలు ఒక పెద్ద లోతైన బావిలా వుంటుంది. అందులోంచి ఆకాశం తప్పితే మరేమీ కనపడదు.
“నన్ను మరో జైలుకు మార్చండి” సారంగపాణి సూపరింటెండెంటుతో మొర పెట్టుకు న్నాడు.
“ఎందుకూ?” అన్నాడు సూపరింటెండెంటు.
“మోదుగులు పూయగా చూడాలి” అన్నా డు సారంగం.
వాడి మాటలు సూపరింటెండెంటుకు ఆర్థం కాలేదు. సారంగపాణి వరంగల్లు జైల్లోనే వుండిపోయాడు.
మేము యెత్తయిన కొండ శిఖరం మీద వున్న ‘నైజామాబాద్’ జైల్లో గడిపాం వసంతం. కొండ కొమ్మున దేవాలయంలా వున్న ఆ జైలుని నాలుగు వైపులా, మోదుగులు చుట్టేసినాయి.
అంతా అడవి. అడవిలో ‘నైజాం సాగర్’ చెరువు కాలవ. కాలవ పక్కగా అక్కడక్కడా -చిన్న చిన్న చెరుకు పొలాలు. నీలాలు జారి పోయే కాలవ గట్లమీద యెర్రటి మోదుగు లు, చల్లని యిప్పపూల వానన.
ఎన్ని యిబ్బందులు పడినా, నైజాం నవాబు కరకు కత్తి యెంత పదునైనా మేం ఆ వసంతం హాయిగా గడిపాం, ‘నైజామాబాద్’ జైల్లో. పూచిన మోదుగుల్ని చూసినప్పుడల్లా నాకు ఒకే ఒక విచారం కలిగేది సారంగం లేడయ్యెనే అని.
సారంగం వరంగల్లు జైల్లోనే వున్నాడు. మోదుగులు పూచినాయి, చల్లారినాయి. వానలు మళ్ళీ వచ్చినాయి. మూడు నాలుగు దీర్ఘమాసాలు సారంగం తన మోదుగుల్ని చూడకుండా యెలా గడిపాడో తెలీదు.
తీరా వానలు పడ్డాక సారంగం మా జైలుకు వచ్చాడు. కుంకుమ నోచుకోని విధవ స్త్రీలలా వున్నై మోదుగులు. వాడికి అప్పటికి ఇంకా రక్తవమన వ్యాధి పూర్తిగా తగ్గలేదు. ఎందుకో గాని, చారెడు చారెడు రక్తం కక్కేవాడు. పాపం, పాడు జబ్బు దాపరించింది.
“ఎందుకు నవ్వుతావు?” అని అడిగాను.
“మోదుగులు పూచినై” అన్నాడు సారంగం.
“మోదుగులు పూచినప్పుడూ, పూచి విచ్చుకున్నప్పుడూ, అంతటా పరచుకున్నప్పుడూ నువ్వు జ్ఞాపకం వచ్చేవాడిని. తీరా అవి చల్లారి పోయాక వచ్చావు” అని విచారపడ్డాను.
సారంగపాణి అందుకు జవాబుగా మళ్లీ రక్తం కక్కాడు. నాకు భయం వేసింది. చనిపోతాడేమో అనుకున్నాను.
వాడు చనిపోతాడనే తేల్చుకున్నాం నేనూ, నా మిత్రులూ, జైలు అధికార్లూ, హోం సెక్రెటరీ. విడుదల అర్డరు వచ్చింది సౌరంగ పాణికి. కొండ దిగుతూ రక్తం కక్కి మెట్లన్నీ తడిపాడు. తడుపుతూ వెళ్ళిపోయాడు.
***
“ఆయన జైలు నించి వచ్చాక వానలూ, వాంతులూ మరీ యెక్కువైనై” అంది సారం గం భార్య రవణమ్మ యేడుస్తూ.
“మరి ఇక్కణ్ణించి యెటు వెళ్లాడు?” అని అడిగాను నేను.
“నెత్తురు కక్కడం తగ్గకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడో ‘బోర్డర్ క్యాంపు’లో చేరాడని విన్నాం. పోలీసులు మళ్ళీ వచ్చి ఆయన్ని వెతికారు. నన్ను కొట్టారు. నిజంగా ఆయన దగ్గిర నుంచి పుత్తరమైనా రాలేదు నాకు. ఇంకా నెలకి సైన్యాలు వొస్తయి అనగా ఒక ‘గన్నూ’, తూటాల బెల్టూ వేసుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. చాలా నీరసంగానే పున్నాడు. భోజనం చేసి పోతూ ‘వూచిన మోదుగుల’ చిత్రం తీసుకు పోయాడు. మళ్ళీ రాలేదు” అని యేడిచింది పెద్దగా రవణమ్మ.
జైల్లో వున్నా బావుండేదేమో మాతోపాటు చల్లగా విడుదలయే వాడు, ఈ బాధంతా లేకపోయేది అనుకున్నా నేను. వాడు చనిపోయినట్టు యెక్కడా సరియైన గుర్తులు కనబడలేదు. బోర్డర్ క్యాంప్ వాళ్ల లిస్టుల్లోనూ వాడు చనిపోయినట్టు పేరు లేదు. వాళ్లూ వాడికోసం వెతికారు. నిరాశ పడి పూరుకున్నారు.
సారంగపాణి యింటినిండా రవణమ్మ కన్నీళే కనపడ్డాయ్. భరించ లేకపోయాను. ఓదార్చే వారే కనిపించ లేదు. ఇంటికి వచ్చి విచారంతో మా అమ్మకు ఈ గాథంతా చెప్పాను. ఆమె ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి వెళ్లి ఒక చిత్రం తెచ్చి యిచ్చింది. ‘పూచిన మోదుగులు’!
“ఇది యెలా వొచ్చింది?” అని అడిగాను అమ్మను.
ఆమె చెప్పింది నేను జైల్లో వుండగా రహస్యంగా వొక అర్ధరాత్రి సారంగం మా ఇంటికి వచ్చాడుట. వాడు పాపం, నా క్షేమ సమాచారం, జైలు గొడవా చెప్పి, భోజనం చేసి వెళ్లిపోయాడట. ఈ చిత్రం మాత్రం మరిచిపోయాడు. మళ్లీ రాలేదు.
వాడు వెళ్లిపోయిన తెల్లవారగట్లే రజాకార్లు, పోలీసులూ ఒక కాంగ్రెసు వాణ్ణి చంపి ‘గన్నూ’, తూటాలూ తెచ్చారట. వాడే సారంగమేమో!
సైన్యాలు వచ్చాక మేం సారంగం స్మృతి చిహ్నంగా ఒక వేదిక కట్టి దానిమీద మూడు రంగులూ యెగరేశాం.
కాని, వూరి చుట్టూ మోదుగులు పూచినప్పుడల్లా సారంగం వాటి నీడల్లో నడయాడుతున్నట్టు అనిపిస్తుంది. రవణమ్మ సారంగం కోసం ఇప్పటికీ ఆ మోదుగులన్నీ వెతుక్కుంటోంటుంది.
‘తెలుగు స్వతంత్ర’ వారపత్రిక,
ప్రచురితం: 1949 సెప్టెంబర్ 23
‘కథా నిలయం’ సౌజన్యంతో..