calender_icon.png 13 January, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్‌ను కోర్టులు ఆదేశించలేవు

09-07-2024 12:42:14 AM

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్‌దే తుది నిర్ణయం

1992లో సుప్రీం విస్తృత ధర్మాసనం తీర్పు కూడా అదే

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పిటిషన్‌పై హైకోర్టులో ఏజీ వాదన

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ బీఫాంపై అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలం టూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేయాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం హైకోర్టును కోరింది. స్పీకర్ కార్యాలయ కార్యదర్శి దాఖలుచేసిన పిటిష న్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

స్పీకర్ కార్యాలయ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించా రు. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకొనేందుకు వీలు లేద ని తెలిపారు. స్పీకర్ తన ముందున్న పార్టీ ఫిరాయింపుల వివాదాన్ని పరిష్కరించేవరకు హైకోర్టులు ఆ వ్యవహారంపై జోక్యం చేసుకోరాదని 1992లో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ఈ తీర్పును సవరిస్తూ స్పీకర్ తన ముందున్న పార్టీ పియింపుల ఫిర్యాదులను మూడు నెలల్లోగా పరిష్కరించాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ తీర్పును అమలు చేయాలని పిటిషనర్ల న్యాయవాది కోరడం చెల్లదని వాదించారు.

ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఉత్తర్వులు ఉండగా ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉత్తర్వులు ఉనికిలో ఉండబోవని చెప్పారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఫిరాయించటాన్ని సవాల్ చేసిన కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు సూచించిందని, కానీ ఆ ధర్మాసనం ఏర్పాటు కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో 1992లో ఇచ్చిన తీర్పుకే హైకోర్టు కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో తాజాగా ఐదుగురు న్యాయమూర్తులతో ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులు అమలు జరిగి ఆ బెంచ్ తీర్పు వెలువరించే వరకు పార్టీ పిరాయింపుల వివాదాన్ని పెండింగ్‌లో ఉంచాలని కోరారు. 

స్పీకర్‌ను కోర్టులు ఆదేశించలేవు

రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ముందున్న పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువరించేవరకు హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని ఏజీ వాదించారు. చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా సభ నుంచి శ్వాశ్వత బహిష్కరణ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌కు మాత్రమే ఉంటాయని, ఆ విషయాలపై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేయలేవని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.

అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించబోతుంటే, పిటిషినర్ల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు కల్పించుకుని, వాయిదా ఎక్కువ రోజులు వేయరాదని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల సంఖ్య పెరగకుండా ఉండాలంటే హైకోర్టు సత్వరమే విచారణ చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫు సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి కల్పించుకుని కోర్టు బయట ఏదో జరగబోతుందని ఊహాజనితంగా చెప్పి విచారణ వెంటవెంటనే జరగాలని కోరడం సబబు కాదని వాదించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.