calender_icon.png 2 November, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్‌కు కోర్టులు ఆదేశాల జారీకి వీల్లేదు

31-07-2024 12:35:15 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో వాదనలు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే అంశం పూర్తిగా అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనిదని ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది బీ మయూర్‌రెడ్డి వాదించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూ ల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరించి విచారణ జరిపి తగిన నిర్ణ యం తీసుకుంటారని చెప్పారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నాకే కోర్టులు జోక్యం చేసుకునేందు కు వీలుంటుందని,ఈలోగా రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని వాదించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన కడి యం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరు తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను మంగళవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. మయూర్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, గత ప్రభుత్వంలో పదేళ్లు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇటీవలే బాధ్యతలు తీసుకున్న స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు ఒత్తిడి చేయడం విచిత్రంగా ఉందని అన్నా రు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో ఇదే హైకోర్టు ఏవిధమైన ఉత్తర్వులూ ఇవ్వలేదని గుర్తు చేశారు.

రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదని కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఉదహరించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే కోర్టుల న్యాయ సమీక్షకు వీలుంటుందని తెలిపారు. అందువల్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేయాలని కోరా రు. పార్టీ ఫిరాయింపులు, అనర్హత అంశాలపై చట్టసభ నిర్ణయం తీసుకోదని తెలి పారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదన లు వినిపిస్తూ, స్పీకర్ తుది నిర్ణయం తర్వాతే కోర్టుల జోక్యానికి వీలుందని తెలిపారు. సుప్రీంకోర్టు వెలువరించిన ఏ తీర్పులను పరిశీలించినా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదని పేర్కొన్నారు. 

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు కల్పించుకుని చట్టసభ చైర్మన్‌గా అంటే స్పీకర్ హోదాలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదాన్ని విచారించి నిర్ణయం తీసుకోరని, పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఫిరాయింపు పిటిషన్లపై విచారణ చేస్తారు కాబట్టి కోర్టులు స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయవచ్చునని వాదించారు. నిర్ధిష్టకాలంలో ఫిరాయింపు పిటిషన్లపై విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పిందని తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 1వ తేదీకి వాయిదా పడింది.