19-03-2025 12:26:37 AM
పోలీసులు సహకరించక పోవడంతో కోర్టు మెట్లేక్కిన మత్స్యకారులు.
ఎట్టకేలకు కోర్టు హెచ్చరికలతో రద్దయిన అక్రమ కాంట్రాక్టు.
మరికొన్ని చెరువుల్లోనూ ఇదే పరిస్థితి.
నాగర్ కర్నూల్ మర్చి 18 విజయక్రాంతి నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపలను విడుదల చేయగా అట్టి చేపలను పట్టుకునేందుకు ఆంధ్ర కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకొని కొందరు అక్రమార్కులు చెరువుల్లోని చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేందుకు శథవిధాల యత్నించారు.
ఫలితంగా ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని గుర్తించి విజయక్రాంతి వరుస కథనాలను ప్రచురించింది. అంగట్లో అర్రాస్ పాట, చేపల చెరువులపై గులాబీ రాబందులు అంటూ వరుస కథనాలు ప్రచురించడంతో జిల్లా మత్స్యశాఖ అధికారి రజిని స్పందించారు.
అక్రమ కాంట్రాక్టు ద్వారా చేపలు పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అక్రమంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గుడారాలను తొలగించాలని పోలీసు అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. కాగా స్థానిక పోలీసులు అక్రమార్కుల వైపే నిలవడంతో బాధితులు నాగర్ కర్నూల్ కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ బాధితుల పక్షాన నిలబడి చట్ట ప్రకారం స్థానిక మత్స్యకారులకే చేపలు పట్టే అధికారం ఉంటుందని అక్రమంగా సబ్ కాంట్రాక్టులు ద్వారా చేపలు పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించడంతో అక్రమార్కులు వెనక్కి తగ్గారు. మంగళవారం అక్రమంగా టెండర్లు దాఖలు చేసిన వాటిని రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, తెలకపల్లి మండలం పెద్దూర్, పెద్దపల్లి గ్రామాల చెరువులను కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులకు అప్పగించి ఆ ప్రాంత మత్స్యకారులకు మొండిచే చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై కూడా జిల్లా అధికారులు స్పందించి తమకు ఉపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.