ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ కేసులో వాదనలు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్‌ను శాసనసభ స్పీకర్ విచారణ చేయకుండా కాలయాపన చేసిన పరిస్థితుల్లో ఆ వ్యవహారంపై హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చునని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడాన్ని తీవ్రంగా పరిణించాలని కోరారు. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీ ఆర్యమ సుందరం వాదనలు కొనసాగిస్తూ.. గతంలో స్పీకర్‌కు ఉత్తర్వులు జారీకి వీల్లేదనే తీర్పులు ఉన్న మాట వాస్తవమేనని.. ఇటీవల సుప్రీంకోర్టు, కేశవ్ మెఘాచంద్ కేసులో పదో షెడ్యూల్ లక్ష్యం దెబ్బతినకూడదని చెప్పిందని గుర్తుచేశారు. రాజేంద్రసింగ్ రాణా, కిహోటా హోలా కేసుల్లో సుప్రీం కోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌కు హైకోర్టు/ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చునని తెలిపారు. స్పీకర్ హోదాలో పార్టీ ఫిరాయింపుల వివాదాన్ని పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్‌కు ఫిర్యాదు అందిన ౩ నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మార్చిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేకపోయిందని, ౩ నెలల గరిష్ఠ గడువు ముగిసినందున మరో 4 వారాలు స్పీకర్ సమయం తీసుకునేలా తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడటమే కాకుండా ఆ పదవిలో కొనసాగుతూనే సికింద్రాబాద్ ఎంపీ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం తీవ్ర విషయంగా పగణించాలని కోరారు. ఇలాంటి పరిస్థితులపై కూడా స్పీకర్ స్పందించలేదని చెప్పారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ట్రిబ్యునల్ అధిపతిగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా చేయడం స్పీకర్ రాజ్యాంగ విధి అని అన్నారు. తన ముందున్న ఫిర్యాదుపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులు జోక్యం చేసుకుని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చునని చెప్పారు. అసెంబ్లీ రూల్స్ 6, 7 ప్రకారం స్పీకర్ వ్యవహరించడం లేదన్నారు. న్యాయ శాఖ తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డ్డి, కడియం, దానం తరఫున న్యాయవాదులు మయూర్‌రెడ్డి, శ్రీరఘురాం ఇప్పటికే వాదించారు. తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా పడింది.