తెరపైకి మరోసారి మేడిగడ్డ బరాజ్ వ్యవహారం
- హరీశ్‌రావు సహా 8 మందికి కూడా
సెప్టెంబర్ 5న జరిగే విచారణకు రావాలి
భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు మరో ఏడుగురు అధికారులకు జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు నోటీసులు జారీ చేసింది.
భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగెపల్లి రాజలింగ మూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలని వీరందరికీ నోటీసులు జారీచేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ కల్పతరువుగా గత ప్రభుత్వం ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ పిల్లర్ల కుంగుబాటులో తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని వ్యక్తంచేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు ఐపీసీ 427సెక్షన్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మరుసటి రోజే ఆ ఫైల్ క్లోజ్ చేసినట్టు పిటిషనర్ తెలిపారు. అయితే, రాజలింగమూర్తి తొలుత వేసిన పిటిషన్‌ను ఫస్ట్‌క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు సూచనతో జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రివిజన్ పిటిషన్‌పై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరుపనున్నారు. మాజీ సీఎం, మాజీ మంత్రి సహ తొమ్మిది మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న విచారణకు హాజరుకావాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ అధికార పక్షంలో ఎన్న కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహరంపై రోజూ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న క్రమంలో మరోసారి బరాజ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
బరాజ్ కుంగుబాటులో 11మంది బాధ్యులు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్‌లోని పియర్ల కుంగుబాటుకు 11మందిని బాధ్యులను చేస్తూ దాఖలైన రివిజన్ పిటిషన్‌పై కోర్టు నోటీసులు జారీ చేసింది. బరాజ్ డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్లక్ష్యం వరకు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుతో ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరిని బాధ్యులను చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బరాజ్ నిర్మించిన ఎల్‌అండ్‌టీ ప్రతినిధులను ఫిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొంటూ రిఫిటిషన్ దాఖలు చేశారు.