calender_icon.png 1 October, 2024 | 5:07 PM

ఆర్బిఎక్స్ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్..

01-10-2024 01:51:52 PM

దాన్ని తొలగించి కేసీఆర్ అని రాయండి

 మూసి బాధితుల కోర్టు ఖర్చులను బీఆర్ఎస్ భరిస్తుంది- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్,(విజయక్రాంతి): ఆర్బీఎక్స్ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అని, మూసి నిర్వాసితులు దాన్ని తొలగించి కేసీఆర్ అని రాయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం అంబర్ పేట్ గోల్నాక తులసి రామ్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసి బాధితులకు టిఆర్ఎస్ భరోసా అనే కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తులసి రామ్ నగర్ కాలనీ వాసు లు వారి గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సోమవారమే హైకోర్టు మొట్టికాయలు వేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదన్నారు. మూసి నిర్వాసితుల కోర్టు ఖర్చులను బిఆర్ఎస్ పార్టీ నే భరిస్తుందనీ తెలిపారు. తమ హయాంలో నగరంలోని 100 శాతం మురుగు శుద్ధి కోసం రూ. నాలుగు వేల కోట్లు కేటాయించామన్నారు.

అభివృద్ధి కోసం పేదలకు ఇబ్బందులు రాకుండా 16 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. కానీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అని అనుకోకుండా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల్లోనే పేదలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. రూ.1.50 లక్షల కోట్లు తో చేస్తున్న మూసి అభివృద్ధి ఎవరికోస మనీ ప్రశ్నించారు. నగర ప్రజలంతా బి ఆర్ ఎస్ కు ఓటేశారని, కాంగ్రెస్కు ఓటు వేయలేదని కక్షగట్టారన్నారు. పేదల ఇండ్లను కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా.. సోనియమ్మ చెప్పిందా అని నిలదీశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు. పేదల ఇండ్లు కూల్చుతుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అన్నారు. మూసి నిర్వాసితులకు, పేదలకు బిఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, లక్ష్మారెడ్డి, గోపీనాథ్, కౌశిక్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, బల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.