calender_icon.png 7 November, 2024 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ నుంచి ‘స్కిల్ వర్సిటీ’లో కోర్సులు

03-08-2024 04:25:23 AM

  1. కోర్సుల నిర్వహణకు విధి విధానాలు సిద్ధం చేస్తున్నాం  
  2. ఆ తర్వాత అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాం 
  3. యువతకు మెరుగైన ఉద్యోగావకాశాల కల్పనే ధ్యేయం 
  4. శాసనమండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): సెప్టెంబర్ మొదటి వారం నుంచే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు రాష్ట్ర రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ నెలలో కోర్సులకు సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేస్తామన్నారు. ఆ తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. వర్సిటీ నుంచి ఏటా లక్షలాది మంది యువత గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేస్తారన్నారు. స్థానికంగా సరైన ఉపాధి, ఉద్యోగవకాశాల్లేక యువత గతంలో విదేశాలకు వెళ్లి స్థిరపడేవారని, ఇక నుంచి ఆ అవసరం ఉండదన్నారు.

స్కిల్ వర్సిటీ ద్వారా యువత ఉత్తమ నైపుణ్యాలు సాధిస్తారని, తద్వారా మెరుగైన ఉద్యోగవకాశాలు సాధిస్తారన్నారు. వర్సిటీలో ఏడాది, రెండేళ్ల కోర్సులు ప్రవేశపెడతామన్నారు. కుల వృత్తులకు సంబంధించిన కోర్సులకు విద్యార్హతలు అవసరం లేదని తేల్చిచెప్పారు. టెక్నికల్ కోర్సుల్లో చేరే వారికి ఇంటర్మీడియట్ లేదా ఆపై అర్హత నిర్ణయించి అడ్మిషన్లు ఇస్తామన్నారు. ‘క్రెడాయ్’ సంస్థ కూడా యువతకు నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. తరగతుల బోధనకు అనుభవజ్ఞులైన అధ్యాపకులను పార్ట్ టైమ్ పద్ధతిలో నియమిస్తామన్నారు. మొదటి సంవత్సరం రాజధానిలో కోర్సులు ప్రారంభించి, ఆ తర్వాత జిల్లాకేంద్రాలకు కోర్సులు విస్తరిస్తామన్నారు.

మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్ మధ్య ఉన్న గ్రామాలకు చెందిన యువతకు వ్యవసాయంలో సాంకేతికత వినయోగంపై శిక్షణ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువత యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదద్దడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమన్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా కోర్సులు ఉంటాయన్నారు. పంటలు ఎక్కువ పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీ విషయంలో విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. కోర్సులు ప్రవేశ పెట్టే ముందు మరోసారి అన్ని పార్టీల సభ్యులతో చర్చిస్తామని ప్రకటించారు. సభ్యుల సలహాలు సైతం తీసుకుంటామని స్పష్టం చేశారు.