19-03-2025 08:44:02 PM
ఇల్లెందు (విజయక్రాంతి): తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన కందిపాటి తరుణ్, అదే ప్రాంతంలోని క్యాంపుతండాకు చెందిన ధరావత్ మమత ఇల్లెందు చెరువుకట్ట పెద్దమ్మ తల్లి ఆలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు. మమత తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించటం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేశారని, కొందరితో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ప్రేమజంట తెలిపింది. ఇల్లెందుల పాడుకు చెందిన సిద్ధంకి వెంకన్న (వరుడి తాత) ఇంటి వద్ద ఉండి జీవనోపాధి చూసుకుంటామని, తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ప్రేమజంట ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి తగుచర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ విషయమై సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.