calender_icon.png 16 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరస్థుల జంట అరెస్ట్

03-09-2024 03:52:17 AM

హనుమకొండ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని చెప్తూ అమాయకులను మోసగిస్తూ కోట్లు కొల్లగొడుతున్న తమిళనాడుకు చెందిన జంటను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి చెక్ బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ అంబర్ కిషోర్‌ఝా నిందితుల వివరాలు వెల్లడించారు.

తమిళనాడులోని తాంబరం పట్టణానికి చెందిన జసిల్, ప్రీతి కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తప్పుడు ప్రచారంలో గోల్డ్‌మ్యాన్ సచ్, యాం బ్రాండింగ్స్ అనే తప్పుడు వెబ్‌సైట్లలో ప్రజలతో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించారు. ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి జమచేసిన డబ్బులను విత్ డ్రా చేసి జల్సాలకు పాల్పడుతున్నారు.

హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి నిందితులు తప్పుడు ప్రచారాన్ని నమ్మి వీరు సూచించిన నకిలీ వెబ్‌సైట్లలో సుమారు రూ.28 లక్షలు పెట్టుబడి పెట్టాడు. మోసపోయినట్టు గ్రహించి వరంగల్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.  సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించి, చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీపీ తెలిపారు.