calender_icon.png 10 January, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మ వ్యూహంలో దేశం

30-07-2024 01:14:32 AM

సకల వ్యవస్థలూ చక్రవ్యూహంలో దిగ్బంధనం 

ఆరుగురు వ్యక్తుల చేతిలో దేశం బంధీ

దేశంలో భయోత్పాతాన్ని వ్యాప్తి చేస్తున్నారు

మోదీ ప్రభుత్వం సైనికులనూ వదలట్లేదు

అగ్నివీర్‌ల శ్రమ, జీవితాల దోపిడీ

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఫైర్

న్యూఢిల్లీ, జూలై 29: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య సోమవారం తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకొన్నాయి. బడ్జెట్‌పై  చర్చలో భాగంగా లోక్‌సభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. మోదీ సర్కారుపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారతీయులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్రవ్యూహంలో బంధించిందని ధ్వజమెత్తారు. సైనిక దళాల్లోకి ప్రవేశాల కోసం అగ్నివీర్ పథకం తెచ్చి కేంద్రం చివరకు సైనికులను కూడా దోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తిప్పికొట్టారు. 

ఇదేం దోపిడీ?

దేశ ప్రజలను బీజేపీ గుప్పిట పట్టిందని రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘వేల ఏండ్లక్రితం కురుక్షేత్ర యుద్ధంలో ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహం పన్ని అభిమన్యుడిని చంపారు. చక్రవ్యూహానికి పద్మవ్యూహమని మరో పేరు కూడా ఉన్నది. అంటే కమలం పువ్వు వ్యూహమని అర్థం. 21వ శతాబ్దంలో కొత్త రకమైన చక్రవ్యూహం ఏర్పాటుచేయబడింది. అది కూడా కమలం పువ్వు వ్యూహమే. ప్రధాని నరేంద్రమోదీ ఆ చిత్రాన్ని తన గుండెలపై ధరిస్తారు. నాడు అభిమన్యుడికి ఏం జరిగిందో నేడు భారత్ మొత్తానికి అదే జరుగుతున్నది. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొత్తం ఈ చక్రవ్యూహంలో చిక్కాయి. నాడు అభిమన్యుడిని ఆరుగురు చంపితే, నేడు దేశాన్ని కూడా ఆరుగురు చక్రవ్యూహంలో బంధించారు. వారే నరేంద్రమోదీ, అమిత్ షా, మోహన్‌భాగవత్, అజిత్ దోబాల్, అంబానీ, అదానీ’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. 

మూడు శక్తుల వ్యూహం

దేశాన్ని మూడు శక్తులు పీల్చివేస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘భారత్‌ను చక్రవ్యూహంలో బంధించటం వెనుక మూడు శక్తులు ఉన్నాయి. ఒకటి ఏకస్వామ్యం. దేశం మొత్తం సంపదను సొంతం చేసుకొనేందుకు ఇద్దరు వ్యక్తులకే అనుమతి ఇచ్చారు. దీనివల్ల సంపద కేంద్రీకరణ జరుగుతున్నది. రెండోది వ్యవస్థల ఆక్రమణ. సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఆక్రమించారు. మూడోది రాజకీయ కార్యనిర్వహణ. చక్రంవ్యూహంలో ఈ మూడు అతిముఖ్యమైనవి. ఇవి దేశాన్ని నాశనం చేస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు.

అగ్నివీర్లను మోసం చేశారు

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్లను కూడా మోసం చేసిందని రాహుల్‌గాంధీ విమర్శించారు. ‘అగ్నివీర్ చక్రవ్యూహంలో దేశపు యువత చిక్కుకున్నారు. బడ్జెట్‌లో అగ్నివీర్‌లకు పెన్షన్‌కు సంబంధించి ప్రస్తావనే లేదు. మీరు ఏర్పాటుచేసిన ఈ చక్రవ్యూహ కోట్లాదిమందికి నష్టం చేస్తున్నాయి. మేం ఈ చక్రవ్యూహాన్ని చేధించబోతున్నాం. అందుకు మేం ఎంచుకొన్న అతిపెద్ద మార్గం కుల గణన. అది మీకు భయం కలిగిస్తుంది. నేను చెప్పినట్టు ఈ సభలోనే ఇండీ కూటమి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పిస్తుంది. కుల గణనను కూడా ఈ సభలోనే పాస్ చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేసి తీరుతాం’ అని స్పష్టంచేశారు. 

భయం గుప్పిట్లో దేశం

బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘దేశంలో నేడు ఒకరకమైన భయోత్పాద వాతావరణం ఏర్పడింది. ఈ భయాలు దేశంని అన్నిరంగాల్లోనూ వ్యాపించాయి. ఈ విషయాన్ని నా మిత్రులు కనిపెట్టారు. కానీ, వాళ్లు కూడా భయపడుతున్నారు. బీజేపీలో ఒకే ఒక్కవ్యక్తికి ప్రధాని కలను నిజం చేసుకొనేందుకు అవకాశం ఉన్నది. ఒకవేళ రక్షణ శాఖ మంత్రి ప్రధాని కావాలని అనుకొన్నా అక్కడొక సమస్య ఉన్నది.. అదే భయం. ఈ భయం దేశమంతా వ్యాపించింది’ అని విమర్శించారు.