28-02-2025 02:01:02 AM
కరీంనగర్, ఫిబ్రవరి (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ మార్చి 3న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోగల ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 56 మందితో కూడిన బ్యాలెట్ పేపర్ కావడంతో ఉమ్మడి నాలుగు జిల్లాల బ్యాలెట్లను కట్టలు కట్టి కౌంటింగ్ ప్రారంభమయ్యే వరకు సాయంత్రం సమయం పట్టే అవకాశం ఉంది.
ఉపాధ్యాయ నియోజకవర్గ కౌంటింగ్ మొదటి రోజులోనే పూర్తయ్యే అవకాశం ఉండగా, పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల సంఖ్యతోపాటు అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గురువారం రాత్రి వరకు పోలింగ్ బాక్సులను స్ట్రాంగ్ రూంకు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు.