24-03-2025 09:15:20 PM
మోసపోతున్న అమాయక గిరిజనులు..
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల మండలమైన చర్లలో గుట్టుచప్పుడు కాకుండా దొంగ నోట్ల చలామణి సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ మండలంలో నిరక్షరాస్యత కలిగిన అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని కొందరు ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. చర్ల మండలంలోని మారుమూల గ్రామాల నుంచే కాక, చత్తీస్గడ్ వంటి సరిహద్దు రాష్ట్రంలోని గ్రామాల నుంచి ఆదివారం సంతకు చర్ల మండల కేంద్రానికి వస్తుంటారు. సంతలో వారికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు.
నకిలీ నోట్ల చలామణి ముఠా దీన్ని ఆసరాగా తీసుకొని ధరల విషయంలో, వస్తువుల కాటా విషయంలో నాణ్యత విషయంలో వారిని మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అసలుకు బదులు నకిలీ నోట్లు అంట కడుతున్నారని తెలుస్తోంది. ఎండలో కష్టపడి పని చేసేందుకు వలసలు వచ్చిన ఆదివాసి గిరిజనులు, కూలి నాలి చేసి డబ్బు సంపాదిస్తుంటే అమాయక గిరిజనులను దగా పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం చాప కింద నీరులా మండలంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మండలంలో జరుగుతున్న నకిలీ నోట్ల చలామణిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి అమాయక గిరిజనులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.