* రాష్ట్రానికి, యూజీసీ, వీసీ చక్రపాణిలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వైస్ చాన్సలర్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీ, వీసీగా నియమితులైన డాక్టర్ చక్రపాణిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీసీగా డాక్టర్ ఘంటా చక్రపాణికి అర్హతలు లేవని పేర్కొంటూ హనుమకొండకు చెందిన అసోసియేట్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ బీ కుమారస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్లతోపాటు వీసీ చక్రపాణికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించా రు. పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా చక్రపాణిని వీసీగా నియమించారన్నారు.
ఆర్టికల్ 319(బీ) ప్రకారం చక్రపాణికి అర్హత లేదన్నారు. గంభీరన్ కే గాద్వి వర్సె స్ గుజరాత్ కేసులో యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు ఉండాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారన్నారు. నియామక కమిటీలో సైతం సభ్యులు నిబంధనల ప్రకారం లేరన్నారు.
వర్సిటీలో పదేండ్లు ప్రొఫెసర్‌గా, రీసెర్చ్ వింగ్‌లో అనుభవం ఉన్న విశిష్ట విద్యావేత్తను వీసీగా నియమించాలన్న నిబంధనలను పాటించలేదన్నారు. 2014 నుంచి 2020 వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా చేశాక తిరిగి ప్రొఫెసర్‌గా పని చేశారని, ప్రొఫెసర్‌గా ఆయనకు ఎనిమిదేండ్ల సర్వీస్ మాత్రమే ఉందన్నారు. 60 ఏండ్ల్ల వయోపరిమితి కూడా దాటిపోయిందన్నారు.