calender_icon.png 14 December, 2024 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌంట్‌డౌన్ స్టార్ట్

14-12-2024 12:34:46 AM

  1. నెలన్నరతో ముగియనున్న బల్దియాల పదవీకాలం
  2. రూ.కోట్లలో కాంట్రాక్టర్లకు బకాయిలు
  3. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అనుమానమే!

కరీంనగర్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మున్సిపాలిటీలు, రెండు నగరపాలక సంస్థ లు ఉండగా.. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పదవీకాలం 2025 జనవరి 29తో  ముగియనుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థలో 10 మందికిపైగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఇతర మున్సిపాలిటీలలోని పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు. బల్దియాలో రాజకీయ మార్పుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

అయితే మున్సి పాలిటీల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహి ంచాలంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ రావాలి. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో బల్దియా పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.

కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు పలు మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హామీ పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 

ప్రభుత్వ మార్పుతో..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాదిలో పట్టణ ప్రగతి, సీఎం హామీ నిధులు పూర్తిగా నిలిపివేసింది. దీంతో మున్సిపల్ సాధారణ నిధులు మినహా నగరపాలక సంస్థలో ప్రత్యేక నిధులు లేకుండా పోయాయి. గతేడాదితో పోల్చితే ఈసారి రియల్ వ్యాపారం తగ్గడంతో భవన నిర్మాణ అను మతులతో వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది.

ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ఇతరత్రా పన్నులు కూడా ఆశించిన మేరకు వసూలు కాకపోవడంతో ఖాజానా నిధులు నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. దీంతో గతేడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభంకాగా.. పనుల నిమిత్తం రోడ్లను తవ్విన కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చే వరకు పనులు చేయమని మొండికేయడంతో సగానికి పైగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. 

కార్పొరేటర్లపై ఒత్తిడి..

రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కార్పొరేటర్లకు ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. చివరి ఏడాదిలో వేగం గా పనులు చేసి ఎన్నికలకు వెళ్లొచ్చని కార్పొరేటర్లు భావించారు. అయితే కొత్త పనుల దేవుడెరుగు.. పనులు పూర్తి చేయకముందే పాలకవర్గ పదవీకాలం ముగుస్తుం డడం కార్పొరేటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. 

బీఆర్‌ఎస్ పాలన సంతృప్తినిచ్చింది

బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన సంతృప్తినిచ్చింది. స్మార్ట్ సిటీ ద్వారా నగర రూపురేఖలు మార్చగలిగాం. అమృత్-1, 2 పథకాల ద్వారా తాగునీటి పైపులైన్ల విస్తరణతోపాటు మాస్టర్ రూపకల్పన పూర్తి చేశాం. అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో నగరానికి నిధులు కేటాయించడంతో అనేక పనులు చేసుకోగలిగాం

 వై సునీల్‌రావు, 

కరీంనగర్ మేయర్