13-02-2025 10:48:00 PM
ఎల్బీనగర్: కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జబల్ పూర్ సిహోరా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరైన హైదరాబాద్ చైతన్యపురిలోని మారుతి నగర్ కు చెందిన నవీన్ చారిని మధ్యప్రదేశ్ లో చికిత్స చేయిస్తూ... ఈ రోజు హైదరాబాద్ కొత్త పేటలోని సాయి సంజీవని దవాఖానకు కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.
నవీన్ చారిని పరామర్శించిన ఎంపీ ఈటల..
కొత్తపేటలోని సాయిసంజీవిని దవాఖానలో చికిత్స పొందుతున్న నవీన్ చారిని గురువారం రాత్రి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దవాఖానకు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహా కుంభమేళా తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరం. ఎలాంటి తప్పిదం లేకున్నా.. ఎదురుగా వచ్చిన భారీ లోడ్ ఉన్న లారీ డీ కొట్టడంతో భారీ గా ప్రాణ నష్టం వాటిల్లిందన్నారు. జరిగిన ఘటన పై వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కేంద్ర మంత్రులతో కలిసి మాట్లాడుతున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ప్రమాదం జరిగింది అక్కడ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకునేలా కోరుతామన్నారు. ఎంపీ ఈటల రాజేందర్తో పాటు కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి, శ్రీవాణి, పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులతో...
ఇదే ప్రమాదంలో మృతి చెందిన గడ్డి అన్నారం డివిజన్ లోని వివేకానంద నగర్ నివాసి గోల్కొండ ఆనంద్ కుమార్ చారి కుటుంబ సభ్యులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈటలను చూసిన ఆనంద్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు.