calender_icon.png 19 March, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషా పండితుల పరిషత్తు

15-02-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప

తెలుగు తేనెలాంటి భాష. నోటినిండా మాట్లాడ గలిగిన తెలుగు. “కడుపునిండా అన్నం తినాలి. నోటినిండా తెలుగు మాట్లాడాలి” అని మా గురువులు ఎంతో అనుభవంతో చెప్పారు. కానీ, ఈ రోజుల్లో తెలుగంటే అటు ప్రభుత్వాలకు, ఇటు మాతృ భాషీయులకు చులకనగా మారింది. రాకపోయినా వచ్చినట్లు ఆంగ్లం లో మాట్లాడుతున్నారు. అదే విధంగా, వచ్చినా రానట్లే తెలుగులో మాట్లాడుతున్నారు. ‘ఎంతో తపస్సు చేస్తే గాని తెలుగు మాతృభాషగా లభించదని’ అప్పయ్య దీక్షితులు అన్నారు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పాశ్చాత్యులే మన తెలుగును ప్రశంసించారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు అయితే ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఎలుగెత్తి చాటారు.

ఎవరెవ్వరు తెలుగు గొప్పతనాన్ని చెప్పారో నాకు ప్రాచ్య కళాశాలలో చేరిన తర్వాతే తెలిసింది. నేను ఆ కళాశాలలో చదువుతానని కలలోనైనా అనుకోలేదు. నా బాల్యంలోని ఒక్కొక్క సంఘటన నా లో తెలుగుపై మమకారం పెంచి, క్రమక్రమంగా తెలుగు అధ్యాపకునిగా నిలబెట్టడ మేగాక ఒక రచయితగానూ తీర్చి దిద్దింది. చిన్నతనంలో మా ఇంట్లో పోతన రచించిన భాగవతం ఉండేది. మా నాన్న బుచ్చయ్య మా అన్నయ్యలతో సాయం త్రం కాగానే దానిని చదివించే వారు. అన్నయ్యలు ఇద్దరూ నాల్గవ తరగతి కూడా చదవలేదు. కానీ, భాగవతం వినిపించేవారు. వారు ఒక్కో పద్యాన్ని చదువు తుంటే వినసొంపుగా ఉండేది.

మాది చేనేత కుటుంబం కనుక, అన్నయ్యలు మగ్గాలు నేస్తూ కంఠస్థమైన పద్యాలను వల్లించేవారు. నేను చెవి యొగ్గి వినేవాణ్ణి. మా ఇంటి వాతావరణం పూర్తిగా భాగవత మయమైపోయింది. ప్రహ్లాదచరిత్ర, ధ్రువోపాఖ్యానం, వామనచరిత్ర, గజేంద్ర మోక్షం, శ్రీరామచరిత్ర, శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, కుచేలోపాఖ్యానం వంటి ఘట్టాలను మా నాన్న మా అందరితోనూ చదివించేవారు. అప్పటికి నేను 3వ తరగతిలోనే ఉన్నాను. పసిప్రాయంలో ఈ రకమైన భాగవత శ్రవణం ఒక విధంగా నన్ను ఓ భక్తునిగా మార్చడానికి మించి భాషాభిమానిని చేసింది. ఎవరికైనా మాతృభాష మీద పట్టు కలగాలంటే మొట్టమొదట వారికి శ్రవణభాగ్యం లభించాలి. స్పష్టమైన ఉచ్చారణ చేసేవారి మధ్య ఉన్నవా రు ఆ మార్గంలో నడవవచ్చు. నాల్గవ తరగతిలో ఉండగానే నాన్న నన్ను బాగవతం చదవమనడం వల్ల నా భాగ్యం లభించింది. మా అన్నయ్యలను అనుకరిస్తూ చదవడానికి ప్రయత్నించేవాణ్ణి. 

అబ్దుల్లా సార్ పుణ్యఫలం

మా ఊళ్లోనే మా పెద్దక్క ఉండేవారు. ఆమె మరిది భద్రయ్యకు తెలుగంటే ప్రా ణం. ఆయన ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ నుంచి విశారద పరీక్షలో నెగ్గి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఉద్యోగం రాలేదు కనుక మగ్గం పనిలో సమయాన్ని గడుపుతూ కమ్మగా పద్యాలు, సంస్కృత శ్లోకాలు చదివేవాడు. నేను తన దగ్గర ఎ న్నో పద్యాలు నేర్చుకున్నాను. ఏ భాషై నా సహజంగా రాదు. పట్టుదలతో నేర్చుకుం టే వస్తుందని ఆయన అభిప్రాయం. ఆయనవల్లే కవిత్రయంతోపాటు కాళిదాస కవి గురించి కూడా నాకు తెలిసింది. నాలో తె లుగు భాషా సాహిత్యాల మీద ప్రేమ కలగడానికి ఆయన కారణమయ్యాడు. నిజా నికి మొదటి తరగతిలో ఉన్నప్పుడు అబ్దు ల్లా అనే సారు ‘అ’ రాసి అమ్మబొమ్మను, ‘ఆ’ రాసి ఆవుబొమ్మను వేసి ఓనమాలు ది ద్దించారు. అందమైన ఆ బొమ్మ లు ఈనాటికీ నా హృదయ ఫలకంలో చిత్రీకృతమై ఉన్నాయి. అమ్మను, ఆవునూ చూసినప్పు డు నాకు అబ్దుల్లా సారే గుర్తు కు వస్తాడు.

అసలు కథ దేవరకొండ తాలూకాలోని జెడ్‌పీహెచ్‌ఎస్ చింతపల్లికి 6వ తరగతిలో ప్రవేశించిన తర్వాతనే మొదలైంది. మా క్లాసు పిల్లలకు తెలుగు పండితుడు ఎలిశెట్టి బాలకృష్ణ. ఆయన విశారద మీదే తెలుగు పండితులుగా ఉద్యోగం సంపాదించారు. తన ప్రభావం నాపై బాగా పడింది. ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వారి ప్రాథమిక పరీక్ష ఫీజు 3 రూపాయలు. ప్రవేశ పరీక్ష ఫీజు 5 రూపాయలు. విశారద, పూర్వోత్తర భాగాలకు కలిపి 10 రూపాయలు. హైస్కూల్లోనే ఎలిశెట్టి బాలకృష్ణ సార్ నాచేత ప్రాథమిక, ప్రవేశ పరీక్షలు రాయించారు. వాటిల్లో ఉత్తీర్ణుడైనందున తెలుగుమీద అపారమైన ప్రేమ కలిగింది. 9వ తరగతిలో ఉండగానే సుమతీ, వేమన శతకాలలోని పద్యాలు 50 చొప్పున నాకు కంఠస్థమయ్యాయి. చిన్నపిల్లలకు శతక పద్యాలు కంఠస్థం చేయిస్తే, అటు భాషా జ్ఞానమూ, ఇటు లోక జ్ఞానమూ రెండు కలుగుతాయనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను అధ్యాప కుడినైన తర్వాత పిల్లలకు శతక పద్యాలు కంఠస్థం చేయించాను.

10వ తరగతి చదువుతుండగానే విశారద పరీక్షకు కూర్చోవాలని బాలకృష్ణ సార్ నన్ను ఆదేశించారు. ఎండకాలం సెలవులు వచ్చినందున నేను మా వూరు కొల్కులపల్లికి రావలసి వచ్చింది. నేనంటే బాలకృష్ణ సార్‌కు ఎంతో వాత్సల్యం. అందుకే, ఆయన స్వయంగా సైకిలుమీద చింతపల్లి నుంచి ఎండలో మా వూరికి వచ్చి నాచేత విశారదకు ఫీజు కట్టించాడు. ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనందున, డిప్‌ఓఎల్ చదవడానికి హైదరాబాద్‌కు రావలసి వచ్చింది. ఇదంతా బాలకృష్ణ సార్ పుణ్యమే.

ప్రాచ్యభాష పునర్వికాసం కోసం..

ఆ కాలంలో పరిషత్తు పక్షాన క్రమంగా జరిగే పరీక్షలకు దేశ విదేశాల్లోని విద్యార్థు లు కూడా హాజరయ్యేవారు. మారిషస్ లో నూ పరిషత్తు పరీక్షలు జరిపేవారు. ము ఖ్యంగా రాష్ర్టేతరులు ఈ పరీక్షలు రాసేవా రు. పరిషత్తు పరీక్షలు రాయడం వల్ల తెలుగులో నాకే కాదు, ఎవరికైనా పట్టు ల భిం చేది. తద్వార పండితులైన వారు తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికి ఎంతగానో తోడ్పడేవారు. ప్రభుత్వాలు చేయలేని పని పరిషత్తు చేసింది. వేలాదిమంది పరిషత్తు పరీక్షలకు కూర్చునేవారు. వయస్సుతో ని మిత్తం లేకుండా స్త్రీ పురుషులు పరీక్షలు రాసి కేవలం విజయపత్రాలు సంపాదించడమే కాక తెలుగు పండితులై తెలుగు భా షా సంస్కృతులకు ఎంతో మే లు చేశారు.

ఆ కాలంలో పరిషత్తు పరీక్షలను నిర్వహించడానికి వ్యవస్థాపకులు ఉండేవారు. వారు ఆయా గ్రామాల్లోకి వెళ్లి పరీక్షలకు రుసుము కట్టించి విద్యార్థులతో పరీక్షలు రాయించేవారు. ఇలాంటి మహత్తరమైన పని పరిషత్తులాంటి సంస్థద్వారా జరగడం వల్ల మొన్నమొన్నటిదాకా ప్రాచ్యభాషా పట్టభద్రులు అధ్యాపకులై తెలుగు భాషా సాహిత్యాల విస్తరణకు తోడ్పడ్డారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఇప్పటికైనా మాతృభాషాభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకోవాలి. కనీసం పరిషత్తు పక్షాన జరిగే పరీక్షలకు తగిన గుర్తింపునైనా ఇవ్వాలి. అప్పుడు ఉద్యోగావకాశాలు వచ్చినప్పుడు తెలుగు భాషా పునరుజ్జీవనానికి అవకాశం లభిస్తుంది.

వ్యాసకర్త సెల్: 9885654381