calender_icon.png 4 October, 2024 | 1:00 AM

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు...

03-10-2024 09:51:34 PM

క్వింటాలు కు కనీస మద్దతు ధర రూ.7,521 నిర్ణయం..

పత్తి కొనుగోళ్లపై ముందస్తు కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేల సమీక్ష... 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఈసారీ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాల కు తావులేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ లతో కలిసి వానాకాలం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ముందస్తు ఏర్పాట్ల పై సమీక్షించారు.

సమావేషంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, జిన్నింగ్ మిల్ యజమానులు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ... పత్తి కొనుగోలు కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలని, రైతుల కొరకు త్రాగునీరు, టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్ప్ లైన్, మార్కెట్ లో సిబ్బంది లోటు లేకుండా చూడాలని, రోడ్ల మరమ్మత్తులు చేయించాలని, కమిటి ఏర్పాటు, తదితర అంశాలపై వారి అభిప్రాయాలను, సమస్యలను కలెక్టర్, శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పత్తి పంట కనీస మద్దతు ధర క్వింటాలుకు 7,521/- రూపాయలు, నాణ్యత ప్రమాణాలు పాటించి 8 శాతం తేమ మించకుండా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.

జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో అర్బన్, రూరల్, బోథ్ లో సొనాల, నేరడిగొండ, పొచ్చర, ఇంద్రవెల్లి లో ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ లో ఇచ్చోడ, జైనథ్ లో బేల లలో ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. డేటా లో ప్రతి రైతు సాగు చేసిన విస్తీర్ణం, ఆశించిన పత్తి ఉత్పత్తి,  రైతు తమ పత్తిని మార్కెట్‌కు తీసుకురావడానికి ప్రణాళిక వేసుకున్న తేదీని పొందుపరచాలని సూచించారు.   శాసన సభ్యులు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆన్ని సదుపాయాలు కల్పించాలని, రైతుల కొరకు కేంద్రాలలో బోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, సబందిత శాఖల అధికారులుతదితరులు పాల్గొన్నారు.