calender_icon.png 25 November, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల పడిగాపులు

22-11-2024 02:28:35 AM

  1. సీసీఐ కేంద్రాలకు పోటెత్తుతున్న పత్తి
  2. దళారులతో సిబ్బంది కుమ్మక్కు   
  3. తేమ పేరుతో తూకంలో ఆలస్యం 

 హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): తాము పండించిన పంటను సరైన సమయానికి అమ్ముకోలేక సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి రైతులు పడిగాపులు పడుతున్నారు. పత్తిని తూకం వేయడానికి తమ వంతు ఎప్పుడు వస్తుందోనని వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వారి పాలిటి శాపంగా మారుతున్నది.

పంటకు మద్దతు ధర పలుకుతుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తుతోంది. గత ఐదారు రోజుల నుంచి కేంద్రాలకు పత్తిని రైతులు తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి నాలుగు కేంద్రాల చొప్పన సీసీఐ కేంద్రాల ఏర్పాటుతో పాటు 319 జిన్నింగ్ మిల్లులు తెరిచారు.

మద్దతు ధర రూ. 7,521 వస్తుండడంతో పాటు వారం రోజులకే ఖాతాలో నగదు జమ అవుతుండడంతో రైతులు సీసీఐ సెంటర్లకు పత్తిని భారీగా తీసుకువస్తున్నారు. దీంతో కేంద్రాల ముందు కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, ఇతర వాహనాలు బారులు తీరుతున్నాయి. అయితే నిర్వాహకులు పత్తిని తూకం వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చలికాలం కావడంతో తేమ పేరుతో కొర్రీలు పెడుతూ పత్తిని కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులతో సిబ్బంది కుమ్మక్కై ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రైతులు అన్నిపనులు మానుకొని పత్తిని అమ్మడం కోసం మూడు, నాలుగు రోజులు సెంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు.

అమ్మకాలు ఆలస్యమై తే రైతులే ఓపిక నశించి వ్యాపారులకు అమ్మకాలు చేస్తారనే ఆలోచనతో నెమ్మదిగా చేస్తున ట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కొందరు వ్యాపారులు సెంటర్లలోనే రైతుల వద్ద పత్తి బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం నిర్వాహకులను మచ్చిక చేసుకొని పట్టాదారు పాస్‌బుక్ లేకుండానే అదే సెంటర్‌లో పత్తి అమ్ముతున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో 42.23లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయగా 25. 33లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన సీసీఐ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 5.50 లక్షల టన్నులకు పైగా పత్తి కొనుగోలు చేసినట్లు సమాచారం. రైతులకు  సుమారుగా రూ. 450 కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

8 శాతం తేమ.. 

 సీసీఐ నిబంధనలు పాటించి పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉందన్నారు. ఇంటివద్ద పత్తిని ఆరబెట్టిన తరువాతే బస్తాలో నింపాలని సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని, అప్పటివరకు పత్తిని అమ్ముకోవచ్చని వెల్లడించారు. 

వాట్సాప్ సేవలు వినియోగించుకోవాలి 

ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ సేవలను పత్తి రైతులు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. దీని ద్వారా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయం, చెల్లింపులు, ఫిర్యాదులు, అర్హతల వంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. మద్దతు ధర పెరగడం, తగ్గడం వంటివి  వాట్సాప్‌లో వెంటనే తెలుసుకోవచ్చన్నారు.   

సిబ్బందిపై నిఘా పెట్టాలి..  స్థానికం గా ఉండే కొందరు వ్యాపారులు మధ్య దళారులను ఏర్పాటు చేసుకుని కమీషన్ పద్ధతిన కొనుగోలు చేస్తూ తూకంలో భారీగా మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నా రు. పత్తి తూకం వేసే కిందిస్థాయి సిబ్బంది మద్దతు పలుకుతున్నారని, వారిపట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.