calender_icon.png 23 October, 2024 | 5:50 PM

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

23-10-2024 03:50:34 PM

రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన విద్యుత్ శాఖ లైన్మెన్

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ లైన్మెన్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని కరకవాగు ప్రాంతంలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, విద్యుత్ ను తన మేనమామ ఇంటి నుంచి వినియోగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లైన్మెన్ నాగరాజు ఇంటి నిర్మాణానికి దొంగ కరెంటు వాడుతున్నావని మీపై కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.68000 ఇవ్వాలని తొలుత డిమాండ్ చేసి, తర్వాత 30,000, చివరికి రూ.26 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సదరు ఇంటి యజమాని ఏసీబీ అధికారులను అప్రోచ్ కాగా బుధవారం లైన్మెన్ నాగరాజుకు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు. అతని అదుపులోకి తీసుకొని విచారించగా డిమాండ్ చేసిన మాట, లంచం తీసుకున్న మాట వాస్తవమని అంగీకరించడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.