- అన్ని శాఖల్లోనూ కలెక్షన్ ఏజెంట్లు
- సీఎం సొంత జిల్లాలో మారని అధికారుల తీరు
నాగర్‌కర్నూల్, నవంబర్ 16 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాగా ఉన్న నాగర్‌కర్నూల్‌లోనే ఇలా జరగడం ఆందోళన కలిగించే అంశం.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, భూ ఆక్రమణలను ప్రస్తు త ప్రభుత్వంలోని ఆయా శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు వారసత్వంగా కొనసాగిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా చేయి తడపాల్సిందేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో కొందరు అధికారులు ఏసీబీకి చిక్కడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కలెక్షన్ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రధాన శాఖలైన విద్య, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, రిజిస్టర్, మైనింగ్, ట్రెజరీ, ఆర్టీవో, పౌర సరఫరాలు, ఆబ్కారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వంటి శాఖలతో పాటు మున్సిపాలిటీల్లోనూ అవినీతి రాజ్యమేలుతున్నదని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడు తున్నారు.
జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి కొందరు కలెక్టరేట్‌లోనే తిష్టవేసి భూ ఆక్రమణలు, భూ తగాదాల కేసుల్లో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారుల పేరుతో కలెక్షన్ ఏంజెంట్లే కొన్ని ఫైళ్లను కదిలిస్తున్నట్లు తెలుస్తున్నది.
దళితబంధులో భారీ అవినీతి!
నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో భారీ అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వం తెచ్చిన దళితబంధు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని, ఎస్సీ కమిషన్ సైతం విచారణ జరిపించాలని ఆదేశాలు ఇచ్చినా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
దుంధుభీ, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ఇసుక మేటలను అక్రమంగా తవ్వి తరలిస్తూ ఇసుక మాఫియా రూ.కోట్లు కూడబెడుతున్నా పట్టించుకోవడం లేదు. రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్టీవో, ఆబ్కారీ వంటి శాఖలపై సమీక్షలు జరుపకపోవడంతో ఆ శాఖల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు.
రైతుల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాల్సిన రైస్‌మిల్లర్లు బియ్యం సరఫరా చేయకపో యినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం ఈ అవినితీని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
వైద్యారోగ్య శాఖలోని కొంద రు ఉద్యోగులు విధులకు రాకుండా నెలసరి జీతం పొందుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి నుంచి ముడుపులు అందుకుని వదిలేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కొంతమం ది ప్రభుత్వ టీచర్లు బడులకు వెళ్లకుండా రాజకీయం, చీటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు.
వారి నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల అర్జీలను చెత్తబుట్టలకే పరిమి తం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరణిలోని భూ సమస్యల కోసం వచ్చే ఫిర్యాదుల ను ఆసరాగా చేసుకుని సెటిల్‌మెంట్ కోసం ఒక్కో ఎకరాకు పర్సంటేజి చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.