calender_icon.png 30 September, 2024 | 3:03 AM

సీఎంఆర్‌లో అవినీతి జలగలు!

30-09-2024 12:44:07 AM

మెదక్ జిల్లాలో రూ.240 కోట్లు మింగిన మిల్లర్లు

చేతులు కాలాక దిద్దుబాటు చర్యలు

క్రిమినల్, ఆర్‌ఆర్ యాక్ట్ కింద కేసులు

ఇప్పటి వరకు రికవరీ చేసింది రూ.18.50 కోట్లే 

మెదక్, సెప్టెంబర్ 2౯(విజయక్రాంతి): కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మెదక్ జిల్లాలోనూ ఏకంగా రూ.240 కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వం ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్‌మిల్లులకు పంపిస్తే.. మిల్లర్లు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించారు.

ఏకంగా రూ.240 కోట్ల ధాన్యం పక్కదారి పట్టింది. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు క్రిమినల్ కేసులు, ఆర్‌ఆర్ యాక్ట్ కింద రికవరీ చర్యలు చేపడుతున్నారు. రూ.18.50 కోట్ల ధాన్యాన్ని మాత్రమే రికవరీ చేయగలిగారు. తాజాగా నర్సాపూర్‌కు చెందిన ఓ మిల్లర్ ఆస్తులను వేలంపాట పెట్టారు. 

జిల్లాలో ఇలా..

జిల్లాలో 2022-23 ఖరీఫ్ సీజన్‌లో 3,86,065 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యం 2,59,474 మెట్రిక్ టన్నులు కాగా సివిల్ సప్లయ్ శాఖకు వచ్చింది మాత్రం 2,38,347 మెట్రిక్ టన్నులే మాత్రమే. అతికష్టం మీద 20 వేల మెట్రిక్ టన్నులను రికవరీ చేశారు.

ఇంకా రూ.3.96 కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సి ఉంది. 2022-23 రబీ సీజన్‌లో 2,99,848 మెట్రిక్ టన్నులకు2,01,904 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 63,697మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిం ది. 2023-24 ఖరీఫ్‌లో 2,68,777 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపగా అందులో 1,80,741 బియ్యం సీఎంఆర్‌కు రావాల్సి ఉంది.

కానీ 99,343 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం రూ.60 కోట్ల విలువైన 16,609 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాలని అధికారులు చెపున్నారు. ఇందుకు గాను ఈనెల 30 వరకు గడువు పెట్టినట్లు చెప్పారు.

అలాగే 2023-24 రబీ సీజన్‌లో 2,52,013 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 1,70,777 బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 60,155 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.400 కోట్ల విలువైన 1,10,622 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ కావాల్సి ఉంది. 

మిల్లర్ల ఆస్తులు జప్తు..

సీఎంఆర్ రికవరీలో భాగంగా ఆలస్యంగా స్పందించిన సివిల్ సప్లయ్ అధికారులు ఆర్‌ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులను పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. నర్సాపూర్‌కు చెందిన ఓ మిల్లర్ నుంచి రూ.57 కోట్లు రికవరీలో భాగంగా రూ.15 కోట్లు చెల్లింపులు జరుగగా, రూ.10.50 కోట్ల విలువైన మిల్లును వేలానికి పెట్టినట్లు అధికారులు చెప్పారు.

అలాగే రూ.2.60 కోట్ల విలువైన భూమిని జప్తు చేసినట్లు పేర్కొన్నారు. శివంపేటకు చెందిన ఓ రైస్‌మిల్లర్ రూ.5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.కోటి రికవరీ అయిందని, అతను కోర్టుకు వెళ్లడంతో కేవిట్ ద్వారా అప్పీల్ చేశామని, త్వరలో రికవరీ చేస్తామని చెబుతున్నారు. 

తప్పకుండా రికవరీ చేస్తాం : హరికృష్ణ, మేనేజర్, సివిల్ సప్లయ్, మెదక్

సీఎంఆర్ ధాన్యం తప్పకుండా రికవరీ చేస్తాం. గతంలో పనిచేసిన అధికారులు సరైన చర్యలు తీసుకోక పోవడంతోనే పెద్దమొత్తంలో అవినీతి జరిగింది. ఇప్పటికే 17 మిల్లులపై ఆర్‌ఆర్ యాక్ట్ నోటీసులిచ్చాం. మరో 8 మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. త్వరలోనే మిగతా సొమ్ము రికవరీ చేస్తాం.