28-03-2025 12:00:00 AM
సూర్యాపేట, మార్చి27 (విజయక్రాంతి): అవినీతి అక్రమాలకు జిల్లా మత్స్యశాఖ కేరాఫ్గా మారిందని, కార్యాలయ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నదనే ఆరోణలు ఉన్నాయి. గత సంవత్సరం జూలైలో జిల్లా మత్స్యశాఖ అధికారిరూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కారు. కాగా తాజాగా కార్యాలయ ఉద్యోగులు, అధికారిపై అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి.
మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మొదలుకొని సభ్యత్వాల జారీ, చెరువుల్లో చేప పిల్లల పంపిణి, కాంట్రాక్టర్ల కేటాయింపు , చివరు ఫిషింగ్ ఆర్డర్ మంజూరు వరకు సంబంధిత అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగానే వెలువడుతున్నాయి.
20 చెరువులకు ఫిషింగ్ ఆర్డర్ మంజూరు
జిల్లాలో 800లకు పైగా చెరువులు ఉన్నాయి. ఇందులో ఎక్కవ చెరువులు సోసైటీల పరిధిలో ఉండగా.. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతున్నది. కాగా ఈ ఏడాది చేపపిల్లల టెండర్లు ఆలస్యం కావడంతో జిల్లాలో కేవలం 315 చెరువుల్లో రూ. 1,23,72,058 కోట్ల ఖర్చు చేసి 1,01,47,984 చేప పిల్లలను వదిలారు.
ఇందులో ఇప్పటి వరకు 20 చెరువులకు ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చారు. కాగా ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వడానికి వివాదం లేని చెరువులు అయితే రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు, వివాదంలో ఉన్న చెరువులకు రూ. లక్షల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆరోపణలు ఇలా...
అక్రమంగా ఫిషింగ్ రైట్స్ ఇచ్చారని జిల్లా మత్స్యశాఖ అధికారికి వ్యతిరేకంగా గత సోమవారం సూర్యాపేట పరిధిలోని రాయినిగూడెం మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారి లంచం తీసుకుని రిజిస్ట్రేషన్ లేని పిల్లలమర్రి గ్రామానికి చెందిన వారికి చేపలు పట్టుకునేలా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. కేసు కోర్టులో ఉండగా ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని వారు ఆరోపించారు.
ఇదే వివాదంలో సూర్యాపేట మత్స్య సహకార సంఘం అద్యక్షులు సారగండ్ల కూడా అధికారి అవినీతికి పాల్పడ్డారని బహిరంగానే ఆరోపించారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని ఓ గ్రామ మత్స్యశాఖ సోసైటీ అక్రమంగా జరిగిందని, ఆ సోసైటికి ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వద్దని ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్థానిక తహశీల్దార్కు పిర్యాదు చేశారు.
కానీ మత్స్యశాఖ కార్యాలయం నుంచి ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చారు. లక్షల్లో ఖర్చుచేసి ఆర్డర్ తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బారీ బందోబస్తుతో చేపలను పట్టడంతో అవినీతి ఆరోపణలపై అనుమానాలకు తావిస్తోందితావిస్తోంది.
ఆరోపణలలో నిజం లేదు..
నిబంధనల మేరకే ఫిషింగ్ ఆర్డర్లు ఇస్తున్నాము. అక్రమాలు జరిగాయనే ఆరోపణలలో వాస్తవం లేదు. కావాలనే కొందరు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులతో మాకు సంబంధం లేదు. రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నాము.
నాగు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి