- తొలిరోజు నుంచే అక్రమార్కులపై కాంగ్రెస్ సర్కారు దూకుడు
- మొదటి ఏడాదిలోనే సంచలన కేసుల నమోదు
- గొర్రెల పంపిణీ స్కామ్, కాళేశ్వరం, ధరణి, విద్యుత్, ఈ-ఫార్ములా రేస్
- ప్రస్తుతం విచారణలో కొన్ని.. తుది దశకు మరికొన్ని
- కటకటాల్లోకి వెళ్లిన పలువురు అధికారులు
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే సర్కారుకు నష్టం కల్గించే, ఖజానాపై భారం మోపే నిర్ణయాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో గత సర్కారు హాయంలో జరిగిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సంచలన కేసులను నమోదు చేసింది. ప్రాజెక్టుల అంచనాలను పెంచేసి వృథా ఖర్చులు.. అస్మదీయులకు లాభం చేకూర్చేందుకు నిర్ణయాలు.. పనులు చేయకున్నా బిల్లుల మంజూరు.. నీళ్ల ప్రాయంగా నిధులు ఖర్చు.. భూముల అక్రమ బదలాయింపులు..
ఇలా పథకాలు, ప్రాజెక్టుల్లో వేళ్లూనుకుపోయిన అవినితి పాలిట తమ ప్రభుత్వం చర్నకోలాలా మారి.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో, ఆరోపిస్తున్న కుంభకోణాల్లో పలువురు బీఆర్‌ఎస్ నేతలు ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సందర్భంగా ప్రజాపాలన వియోజ్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏడాది కాలంలో రాష్ట్రంలో వెలుగుచూసిన కేసులు, కుంభకోణాలు, విచారణలు ఇలా ఉన్నాయి.
వేగంగా కాళేశ్వరం, విద్యుత్ కమిషన్ల విచారణ..
* కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తోంది. కాంట్రాక్టర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు, సొంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి అంచనాలను రూ.లక్ష కోట్లకు పెంచినట్లు ప్రభుత్వం ఆరోపించింది. లక్ష కోట్లు నీటిపాలు అవడంతో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారిస్తోంది.
* బీఆర్‌ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ప్రభుత్వానికి రూ.వేల కోట్లలో నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. దీనిపై విచారణను జస్టిస్ మదన్ బీ లోకూర్‌తో కూడిన న్యాయ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇప్పటికే విచారణ ను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
* బీఆర్‌ఎస్ హయాంలో ఓఆర్‌ఆర్ టోల్‌ను ఓ ప్రైవేటు కంపెనీకి రూ.7,388 కోట్లకు లీజుకు నాటి ప్రభుత్వం టెండర్ ద్వారా అప్పగించింది. అయితే ఎంతో విలువైన ఈ లీజును కేవలం అతి తక్కువ ధరకు నాటి బీఆర్‌ఎస్ సర్కారు అప్పగించడంపై నాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ అప్పగింతలో జరిగిన అవకతవకలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
* బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందం టూ కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. నల్లాలు, పైపులైన్లు నిర్మించకుడా బిల్లు లు డ్రా చేసుకున్నారని గుర్తించింది. అం తేకాకుండా నాసిరకమైన పనులు చేశారని వెల్లడించింది. ఈ పథకంలో దాదా పు రూ.7వేల కోట్ల స్కామ్ జరిగినట్లు అంచనాకు వచ్చింది. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
* రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మరో కేసు ఫోన్ ట్యాపింగ్. బీఆర్‌ఎస్ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారు, ఆఖరికి సొంత పార్టీల ఎమ్మెల్యేల ఫోన్లను కూడా నాటి సర్కారులోని పెద్ద లు ట్యాపింగ్ చేసినట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, పోలీస్ అధికారి తిరుపతన్న అరెస్టు అయ్యారు. ఇందులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండటంతో ఈ కేసు వి చారణ కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది.
* బీఆర్‌ఎస్ సర్కారు గొర్రెలు, చేప పిల్ల పంపిణీని ప్రతిష్టాత్మంగా చేపట్టింది. ఇందులో దాదాపు రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే ఏసీబీ అరెస్టు చేసింది.
* హైదరాబాద్‌తో పాటు శివార్లలో ఏర్పాటు చేసిన టానిక్ మార్టుల్లో దాదాపు రూ.100కోట్ల కుంభకోణాన్ని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. టానిక్ పేరుతో ఒక మార్టు కోసం అనుమతి తీసుకొని, సిటీలో మరికొన్ని షాపులు ఏర్పాటు చేశారు. ఈ మార్టులోని అమ్మకాలపై ట్యాక్స్‌ను కూడా ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఎగవేత విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. టానిక్ మార్టు వెనుక ఉన్న గత ప్రభుత్వంలోని కీలక అధికారులు, నాయకుల వారసులపై కేసులు నమోదు చేసింది.
* వాణిజ్య పన్నుల శాఖలో రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు అధికారులు అక్రమ వ్యాపారులతో చేతులు కలిపినట్లు గుర్తించారు. వ్యాపారం చేయకుం డానే అక్రమార్కులు.. ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ పొందేలా కొందరు అధికారులు సహకరించినట్లు అంతర్గత విచారణలో నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులను ఇప్పుడు సీఐడీ విచారిస్తోంది.
* హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అక్రమార్జన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడు చేయగా వందల కోట్ల అక్రమార్జన బయటపడింది.
* హెచ్‌ఎండీఏ పరిధిలోని వందల కోట్ల భూములు అన్యాక్రాంతమైనట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర విజిలెన్స్ అధాకారులు విచారణ చేపట్టారు. ఈడీ రంగంలోకి దిగి దాదాపు వందల కోట్ల విలువైన 50 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ఈ కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.
ధరణి మాటున దగా
గత సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వచ్చిన సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని కొందరు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌ను వినియోగించి కొందరు అధికారులు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించినట్లు స్వయంగా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులే చెబుతున్నారు.
దీనివల్ల దాదాపు రూ.60 వేల కోట్లు భూములు అన్యాక్రాంతమైనట్లు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర విజిలెన్స్ ఏజెన్సీకి వారు లేఖలు రాశారు. దీని వెనుక బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రూ.60వేల కోట్లు స్కామ్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
* ఇటీవల సంచలనం రేపిన కేసు ఈ-ఫార్ములా రేసు. ఈ కేసులో కేటీఆర్ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యం లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్ హయాంలో ఈఠూ ఫార్మా లా రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల ప్రభుత్వం సొమ్మును మంజూరు చేశారు. అయితే కేటీఆర్ చెప్పడం వల్ల తాను విడుదల చేసినట్లు ఐఏఎస్ అరవింద్ కుమార్ వాగ్మూలం ఇచ్చారు.
దీంతో ఈ కేసులో కేటీఆర్ కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఆయన అనుమతి ఇవ్వగానే అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.