calender_icon.png 11 January, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి?

11-01-2025 12:20:05 AM

  1. దళారులు, ఏజెంట్లదే హవా!
  2. వైరాలో ఒకే రోజు 99 రిజిస్ట్రేషన్లు? 
  3. విచారణకు మంత్రి పొంగులేటి ఆదేశం..

ఖమ్మం, జనవరి 10 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. అవకత  పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా సంబంధిత ఉన్నతాధికారుల్లో చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 దాకా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి.

ఖమ్మంతో సహా మధిర, వైరా, సత్తుపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై అవినీతి ఆరోప  వస్తున్నాయి. వైరా, ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో సహా అన్ని చోట్ల ఏజెంట్ల రాజ్యం మితిమీరడంతో వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలున్నాయి.

తమ వంతు డబ్బు ముట్టజెప్పి, తమ పనులు చేసుకుపోతున్న ఏజెంట్ల వ్యవస్థను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిషేధించినా ఇంకా వారిదే పైచేయిగా కనిపిస్తోంది. వీరి ఆగడాలకు స్పందించే గతంలో వారిని నియంత్రణ చేసేందుకు ప్రభుత్వం  ఎన్నో ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతున్నది. కార్యాలయాల వద్ద దుకాణాలు తెరిచి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

వైరాలో మారని తీరు

వైరా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఇటీవల కాలంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో అవినీతిపరులను గుర్తించి, ఇతర ప్రాంతాలకు బదిలీలు చేశారు. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ఇటీవల ఓ అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా 99 రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే అభియోగాలు వచ్చాయి.

ఇక్కడ జరుగుతున్న వ్యవహారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి పోవడంతో సీరియస్ అయినట్లు సమాచారం. విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తున్నది. శుక్రవారం వైరా కార్యాలయానికి విచారణ బృందం వస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ సెలవు పెట్టి వెళ్లినట్లు తెలిసింది. వివరణకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. దస్తావేజుల విషయంలో వినియోగదా రులకు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  దస్తావేజు అందజేసిన దగ్గర నుంచి ప్రతి సెక్షన్‌లో ఎంతో కొంత ముట్టజెప్పందే పని కావడం లేదంటున్నారు. 

దళారులుదే ఇష్టారాజ్యం 

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారులుదే ఇష్టారాజ్యంగా మారిందన్నది జగమెరిగిన సత్యం. దళారులు, ఏజెంట్లు ప్రజల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు అధికా  మిలాఖత్ కావడంతో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నది. వీరికి తోడు మధ్య దళారులు కావాల్సిన ధ్రువప్రతాలు ఇప్పిస్తామంటూ ప్రజలను పిండుతున్నారు.

ఖమ్మం రూరల్ కార్యాలయంలో దళారుల బెడద అధికంగా ఉన్నది. కొంత మంది రాజకీయ రంగు ముసుగులో కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అనధికార డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

ఖమ్మం రూరల్‌లో నిబంధనలకు పాతర

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఎప్పటి నుంచో  ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉన్నది. కానీ ఖమ్మం రూరల్‌లో ఈ నిబంధన పాటించడం లేదు. ఎప్పటి నుంచో ఉన్న ఇంటికి కొత్త ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి ఇంటి ధ్రువీకరణపత్రం కావాలని వేధిస్తున్నారు. అయితే కావాల్సినంత సమర్పిస్తే ఈ నిబంధనలు సడలించి, రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

అక్రమార్కులకు బ్రేక్ వేయలేరా?

ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి దందాపై విచారణ జరిపి, రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏసీబీ అధికారులు కూడా ఈ కార్యాలయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. రిజిస్ట్రార్, ఎమ్మార్మో కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డులను పరిశీలన చేయాలని కోరుతున్నారు.