14-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 13(విజయక్రాంతి): జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో గల తపాలా శాఖ కార్యాలయంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల గ్రామానికి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు ఈ.నవీన్‌కుమార్ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ ఫిర్యాదుకు స్పందించిన తపాలా శాఖ ఢిల్లీ బృందం గురువారం గ్రామానికి వచ్చి అధికారులపై విచారణ జరిపింది. వెంకిర్యాల తపాలా శాఖ కార్యాలయంలో పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్న ఈర్ల అనూష సమయానికి పింఛన్ డబ్బులు ఇవ్వకుండా సొంతానికి వాడుకుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉపాధి హామీలో వచ్చిన డబ్బుల్లోనూ అవకతవకలు పాల్పడ్డారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ ఉమెన్ భర్త లక్ష్మీనారాయణ రాజకీయ నాయకుడిగా ఉంటూ అవినీతిని ప్రోత్సాహిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.
తపాలా శాఖ ఢిల్లీ అధికారి ఏఎస్‌పీ జస్విందర్ ఆధ్వర్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ప్రశ్నించారు. తప్పు జరిగినట్లు రుజువైతే చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అరుణ్, బాబు, ఉమాపతి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.