calender_icon.png 27 December, 2024 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 రోజుల్లో 30 మంది

03-12-2024 12:54:46 AM

  1. నవంబర్‌లో ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారులు
  2. మొత్తం 18 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ
  3. గతంలో పట్టుబడ్డ పలువురి అధికారులకు జైలుశిక్ష ఖరారు
  4. ఏసీబీ డీజీ విజయ్‌కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నెలలో నిర్వహించిన దాడుల్లో మొత్తం 30 మంది పట్టుబడ్డారని, 18 కేసులు నమోదైనట్లు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. లంచం తీసుకుంటున్న కేసులు 17 కేసులు కాగా, మరో కేసులో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్నారు.

ఈ మేరకు ఏసీబీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పలు కేసుల్లో పట్టుబడ్డ మొత్తం 30 మంది అవినీతి అధికారుల్లో 27 మంది ప్రభుత్వాధికారులు, మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీరిని అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ కస్టడీకి తరలించామన్నారు.

పంచాయతీరాజ్, విద్య, పోలీస్, మున్సిపల్, టీజీఎస్ రెవెన్యూ, జీహెచ్ కమర్షియల్ టాక్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ వంటి వివిధ శాఖల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన కేసుల్లో మొత్తం రూ. 3.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న నిఖేశ్‌కుమార్‌కు చెందిన రూ 17.73 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామన్నారు. 

లంచం అడిగితే 1064కి ఫిర్యాదు చేయండి

లంచం ఇవ్వకండి - లంచం అడిగితే మాకు సమాచారం ఇవ్వండంటూ ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లంచం తీసుకోవడమే కాదు..  ఇవ్వడం కూడా నేరమేనని చెప్పారు. ప్రభుత్వాధికారులెవరైనా లంచం ఇవ్వాలని అడిగితే భయ పడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలన్నారు. లంచగొండి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేయడానికి  టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వెబ్‌సైట్ acb@telangana.gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు.