- ధరణి పోర్టల్‌తో వేల కోట్ల భూముల అక్రమాలు
- రాత్రికి రాత్రే నకిలీ పత్రాలు సృష్టించి మోసాలు
- అధికారం అడ్డం పెట్టుకొని అంతులేని అవినీతి
- ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్న బాధితులు
- అమోయ్‌కుమార్, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌పై ఫిర్యాదు
- మరింత మంది బయటకు వచ్చే అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో అవినీతి ఐఏఎస్ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్, భూదాన్, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన స్థలాలను బీఆర్‌ఎస్ ప్రముఖులు వారి సంబంధీకులు, బినామీలకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం పత్రాలు సృష్టించి తమకు కావాల్సిన వారి పేరుపై పట్టాలు చేశారని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మహేశ్వరం మండలం నాగారంలోని సుమారు 42 ఎకరాల భూదాన్ భూముల బదిలీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా బుధవారం అమోయ్‌కుమార్‌తోపాటు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని బాలసాయి ట్రస్ట్‌కు చెందిన 45 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని బాధితులు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. కొండాపూర్‌లోని మజీద్‌బండ ప్రాంతంలో సర్వే నంబర్ 104 నుంచి 108లో గల మొత్తం 88 ఎకరాలను ఓ కుటుంబం బాలసాయి ట్రస్ట్‌కు దానం చేసింది.
ఈ భూమిపై కన్నేసిన అధికారులు రాత్రికి రాత్రే జీవో నంబర్.45ను జారీ చేసి, నకిలీ పత్రాలతో అందులోని 45 ఎకరాలను భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తూ అక్రమంగా బదిలీ చేశారని బాధితులు వేదె రాఘవయ్య, సురేష్ ఈడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను అందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకొవాలని కోరారు.
అమోయ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో పాల్పడిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మహేశ్వరం మండలం నాగారంలోని సుమారు 42 ఎకరాల భూదాన్ భూముల బదిలీలతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధికి చెందిన తట్టి అన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 108, 109, 110, 111లో 70 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన రికార్డులను అమోయ్‌కుమార్ మార్చినట్లు బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ ప్లాట్ల విస్తీర్ణం దాదాపుగా 2 లక్షల 40 వేల గజాల వరకు ఉంటుందని, మార్కెట్ విలువ రూ.1000 కోట్లు పలుకుతుందని బాధితులు తెలిపారు. వట్టినాగులపల్లిలో సర్వే నంబర్ 111 నుంచి 179 వరకు సుమారు 460 ఎకరాల భూమి ఉంది. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని అందులోని 200 ఎకరాల స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేశారని శంకర్‌హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీకి ఫిర్యాదు చేశారు.
40 ఏళ్లుగా పొజిషన్‌లో ఉన్నా తమను పోలీసు బలగాలతో వెళ్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శంకర్‌హిల్స్‌లో సుమారు 3300 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. నిందితులు దాదాపు రూ.30 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని శంకర్‌హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులను కోరారు.