సుధీర్‌రెడ్డి మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు
పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం అయినట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్లు గోవాకు సేద తీరడానికి మాత్రమే వెళ్లారని.. క్యాంపు రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పిర్జాదిగూడ కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారంటూ వస్తున్న ప్రచారాలపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బుధవారం స్పందించారు. పిర్జాదిగూడ కార్పొరేషన్‌లో 12 మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదన్నారు.
తన బావ కళ్లల్లో ఆనందం చూడడానికి సుధీర్ రెడ్డి మీడియాతో తప్పుడు కథనాలు రాపిస్తున్నట్టు ఆరోపించారు. ఎలాగూ అవిశ్వాసం నెగ్గలేక సుధీర్ రెడ్డి తప్పుడు ప్రచారంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అమాయక ప్రజల ఇళ్లను కూలగొట్టించి ప్రభుత్వ పెద్దలతో సుధీర్ రెడ్డి చీవాట్లు పడ్డారన్నారు. ఇండ్ల కూల్చివేతతో పరువు పోవడంతో తప్పుడు వార్తల ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను మానసికంగా, ఆర్థికంగా హింసకు గురి చేస్తున్న సుధీర్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిసిగ్గుగా చేస్తున్న తప్పుడు ప్రచారంలో మీడియా భాగస్వామ్యం కావడం విచారకరం అని అన్నారు. మీడియా ప్రతినిధులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని మేయర్ హితవు పలికారు.