calender_icon.png 21 April, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్ వర్సెస్ ఇరిగేషన్!

08-04-2025 12:36:22 AM

కరీంనగర్ నగరపాలక సంస్థ శివారు కాలనీల్లో వింత కష్టాలు

మున్సిపల్ పట్టించుకోదు.. ఇరిగేషన్ అటువైపు చూడదు 

చిమ్మ చీకట్లు.. అధ్వాన రోడ్లు

సమస్యలు తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి

కరీంనగర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కు ముఖ ద్వారం....పట్టణ ప్రారంభ ప్రాంతం....8వ డివిజన్ అల్గునూరు పరిధిలోని శివారు ప్రాంతం.... కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారికి సమీప ప్రాంతం... మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కూత వేటు దూరం... ఇన్ని అడ్రస్సులు చెప్పిన ఆ కాలనీలను కనుక్కోలేని పరిస్థితి... ఎందుకంటే... ఆ కాలనీలకు 40ఏళ్లుగా గుర్తింపు లేదు... కనీసం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తిస్తూ  ఓ బోర్డు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి... ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి.

అది కూడా కరీంనగర్ కు స్వాగతం చెప్పే మొట్టమొదటి కాలనీల సమస్యలపై ప్రత్యేక కథనం...ఒకప్పుడు ఎల్ ఎం డి కాలనీకి అనుబంధంగా ఇక్కడ  శ్రీ వెంకటేశ్వర కాలనీ , హుస్సేన్ నగర్, క్రిస్టియన్ కాలనీ , వినాయక నగర్, చేపల కాలనీ , తమిళ కాలనీలు  ఏర్పడ్డాయి.. ఇక్కడి ప్రాంతంలో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వ్యవసాయదారులు, మత్స్యకారులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే  ఎస్ ఆర్ ఎస్ పి (ఎల్‌ఎండి కాలనీ) కార్యాలయాలు, అలుగునూరు విద్యుత్ సబ్ స్టేషన్, పే అండ్ అకౌంట్ ఆఫీస్ , భూగర్భ జల శాఖ, మండల విద్యాధికారి కార్యాలయం, టీచర్ ట్రైనింగ్ సెం టర్, మానసిక వికలాంగుల పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ హాస్టల్, మహిళా ప్రాంగణం  లాంటి ఎన్నో ముఖ్యమైన  కార్యాలయాలు,   శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ రామ సాయి  దేవాలయం లాంటివి ఉన్నా యి.

ఇక్కడి ప్రాంత రహదారులన్నీ  ఇరిగేషన్ భూములతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. రహదారుల అభివృద్ధి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని ఎవరికి వారే అనుకొని  దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడి ప్రాంత రహదారుల అభివృద్ధిని మరిచిపోయారు.  ఇంతటి ముఖ్యమైన ప్రాంతంలో నివసిస్తున్న కాలనీ ప్రజలు రోడ్ల విషయంలో, ఇతరసమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.. కాలనీలో సరైన రోడ్లు , మురికి కాలువలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 

ఒకప్పుడు అలుగునూరు గ్రామపంచాయతీలో అదే కష్టాలు.. నేడు నగరపాలక సంస్థలో ఉన్న అవే కష్టాలు... అసలు ఈ కాలనీలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు కలిగి ఉండి, అనునిత్యం   బిజీగా ఉండే ఈ ప్రాం తం నేడు అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతుంది. ప్రస్తుతం కాలనీ ప్రధాన రహదారి కేవలం 10 ఫీట్ల వెడల్పుతో ఉండి, కంకర తేలిపోయి, రహదారి చుట్టూ దట్టమైన చెట్లు, పిచ్చి మొక్కలతో  రోడ్డు కమ్ముకపోయి ప్రమాదకరంగా మారిపోయింది.

దీంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు కొనసాగించడానికి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు రాత్రివేళ ఇక్కడి ప్రాంతంలో  వీధి దీపాలు లేకపోవడంతో స్థానిక ప్రజలు  నానా అవస్థలు పడు తున్నారు. ఇట్టి రహదారిని అభివృద్ధి చేయాలని ఐదేండ్లుగా ప్రజా ప్రతినిధులకు, అధికా రులకు అక్కడి కాలనీవాసులు ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

కార్పొరేషన్ లో తమ కాలనీని విలీనం చేసి  నేటికీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయని, కనీసం  రోడ్డుకు అడ్డంగా అస్తవ్యస్తంగా ఉన్న పిచ్చి మొక్కలు,  చెట్లను తొలగించడానికి చర్యలు తీసుకోకపోవడంతో, శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చిందం నరసయ్య, బొంతల కళ్యాణ్ చంద్ర సోమవారం రోజున జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు .

ప్రస్తుతం జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఉండడంతో భవి ష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని  ఇక్కడి రోడ్డును రెండు వరుసలతో , సెం ట్రల్ లైటింగ్ వ్యవస్థతో ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ,  ప్రస్తుతం తక్షణ చర్యల కింద రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు , చెట్లను తొలగించి , మట్టి తో నైనా రహదారిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని చిందం నరసయ్య, కళ్యాణ్ చంద్ర ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కోరారు.